కెరీర్లో చాలా ఏళ్ల పాటు ఒక మూసలో సాగిపోయిన సంగీత దర్శకుడు తమన్.. గత కొన్నేళ్లలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని సంగీతాభిమానుల మనసు దోచాడు. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అతనెంత సంచలనం రేపాడో తెలిసిందే. ఈ సినిమా పాటలు సోషల్ మీడియాను హోరెత్తించేశాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా ‘అల వైకుంఠపురములో’ పాటు మార్మోగాయి.
ఈ సినిమా ఒకటే కాదు.. గత కొన్నేళ్లలో తమన్ నుంచి వచ్చిన చాలా ఆడియోలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. అతడి మీద ఒకప్పటి అభిప్రాయాలు మారేలా చేశాయి. ఐతే ఒకప్పటితో పోలిస్తే తమన్ మీద సోషల్ మీడియా దాడి తగ్గినప్పటికీ.. అప్పుడప్పుడూ అతను టార్గెట్ అవుతూనే ఉంటాడు. ‘అరవింద సమేత’ సినిమాకు తమన్ గొప్ప ప్రశంసలు అందుకుంటున్న సమయంలోనే ‘పెనివిటి’ పాట.. అతడి పాత పాటల తరహాలోనే ఉందంటూ విమర్శలూ తప్పలేదు.
తాజాగా తమన్ మరోసారి ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తన పాటనే రిపీట్ చేశాడంటూ తమన్ మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి. ‘టక్ జగదీష్’ టీజర్లో బ్యాగ్రౌండ్లో వినిపించిన పాటే ఈ విమర్శలకు కారణం. ఈ టీజర్లో ‘ఏటికొక్క పూట.. యానాది పాట..’ అంటూ లేడీ వాయిస్‌తో ఓ పాట ప్లే అయిన సంగతి తెలిసిందే. మామూలుగా చూస్తే అది కొత్తగానే అనిపిస్తోంది.
కానీ ఈ పాట ఆరంభం కాగానే జనాలకు ‘అల వైకుంఠపురములో’లోని సిత్తరాల సిరపడు సాంగ్ గుర్తుకొస్తోంది. దాదాపుగా అదే ట్యూన్‌ను తమన్ రిపీట్ చేసేశాడనిపిస్తోంది. కాకపోతే అందులో మేల్ వాయిస్ ఉంటే.. ఇందులో లేడీ వాయిస్ ఉంది. అంతే తేడా. మిగతా పాట స్టయిల్ మొత్తం దాన్నే తలపిస్తోంది. సౌండ్స్ అన్నీ రిపీట్ అయినట్లే ఉన్నాయి. దీంతో తమన్ తన ట్యూన్లను తనే కాపీ కొట్టడం మానడా అంటూ నెటిజన్లు అతడిని విమర్శిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో తమన్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నది వాస్తవం.