ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. హిట్టు కొట్టేశాడు


అల్లరి నరేష్ ఇప్పుడు మామూలు ఆనందంలో లేడు. అతను ఏకంగా ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 2012లో వచ్చిన ‘సుడిగాడు’ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్టూ కొట్టని నరేష్.. ‘నాంది’తో ఆ లోటు తీర్చుకున్నట్లే. ఈ సినిమాకు ఉన్నంతలో మంచి టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఏమాత్రం నిలబడుతుందో అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అందుక్కారణం ఇది సీరియస్ మూవీ కావడమే. అందులోనూ నరేష్ సినిమాలంటే ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేసి చాలా కాలం అయింది కూడా.

మరోవైపు ముందు వారం వచ్చిన ‘ఉప్పెన’ బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్‌గా నిలబడింది. ఈ నేపథ్యంలో ‘నాంది’కి ఏమేర వసూళ్లు వస్తాయో అన్న అనుమానాలు రేకెత్తాయి. ఐతే ఈ చిత్రం అంచనాల్ని మించి పెర్ఫామ్ చేస్తోంది. మంగళవారం నాటికి ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్కును దాటేయడం విశేషం.

నైజాం ఏరియాలో ఆదివారమే ‘నాంది’కి బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక్కడ ఈ చిత్ర గ్రాస్ వసూళ్లు రూ.2 కోట్లు దాటిపోయాయి. మిగతా ఏరియాల్లో కొన్ని సోమవారం బ్రేక్ ఈవెన్ అందుకున్నాయి. మంగళవారం అన్ని షోలూ పూర్తయ్యేసరికి అన్ని ఏరియాల్లోనూ ‘నాంది’ బయ్యర్ల పెట్టుబడిని వెనక్కి తెచ్చేసింది. ఇక బుధవారం నుంచి వచ్చేదంతా లాభమే. బుక్ మై షోలో ఈ చిత్రానికి 93 శాతం రేటింగ్ వచ్చిందంటే.. ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఎలాంటి అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వరుసగా పేలవమైన సినిమాలు అందించేసరికి కొన్నేళ్ల ముందే నరేష్ అంటే జనాలు భయపడిపోయే పరిస్థితి వచ్చేసింది.

ఐతే నరేష్ సినిమాలు చూడటం మానేసినా.. ఒకప్పుడు అతనెంతగా తమను అలరించాడో గుర్తున్న ప్రేక్షకులు తనకు మంచి సినిమా పడాలని హిట్టు రావాలని కోరుకున్నారు. ఇండస్ట్రీ జనాలు సైతం నరేష్ విషయంలో ఇలాగే ఆకాంక్షించారు. ‘నాంది’ అలాంటి సినిమానే అయింది. నిజానికి ఈ సినిమాలోనూ లోపాలు, ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. నరేష్ పడ్డ కష్టం, అతడి సిన్సియారిటీ చూసి ప్రేక్షకులందరూ ‘నాంది’ గురించి సానుకూలంగా మాట్లాడుతున్నారు. మౌత్ టాక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది.