పహిల్వాన్లతో పవన్ పోరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్దగా హడావుడి లేకుండా ఓ భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందిస్తుంటే.. పవన్‌తో ఒకప్పుడు ‘ఖుషి’ లాంటి ఆల్ టైం బ్లాక్‌బస్టర్ అందించిన సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నం దీన్ని నిర్మిస్తున్నాడు. పవన్ నటిస్తున్న మిగతా చిత్రాలతో పోలిస్తే దీని గురించి మీడియాలో పెద్దగా హడావుడి లేదు. ఐతే పవన్ కెరీర్లోనే ఇది అత్యధిక బడ్జెట్లో తెరకెక్కతున్న సినిమా అని, ఇది పవన్‌కు మినీ బాహుబలి లాంటి సినిమా కాగలదని చిత్ర వర్గాలు అంటున్నాయి. రెండు శతాబ్దాల వెనుకటి కథాంశంతో చారిత్రక నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసమే ‘హరహర వీరమల్లు’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్ర చేస్తున్నాడని తెెలుస్తోంది.

కాగా ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో భారీ ఎత్తున చార్మినార్ సెట్ వేసి సినిమాకు సంబంధించి కీలక దృశ్యాలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో హైదరాబాద్‌ పాత బస్తీకి చెందిన పహిల్వాన్లు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వారితో కలిసి లొకేషన్లో పవన్ దిగిన ఫొటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చాయి. పాత బస్తీ పహిల్వాన్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. శతాబ్దాల కిందట్నుంచి అక్కడి కొన్ని కుటుంబాలు కుస్తీని వారసత్వంగా కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు వారి ప్రభ తగ్గింది కానీ.. ప్రతి ఇంటి ముందు ఒక కుస్తీ అఖాడాను ఏర్పాటు చేసుకుని వాటిలో సాధన చేసేవారు పహిల్వాన్ల కుటుంబీకులు. ఇప్పటికీ కొన్ని కుటుంబాలు కుస్తీకే అంకితం అయ్యాయి. గొప్ప చరిత్ర ఉన్న ఆ కుటుంబాల నుంచే పహిల్వాన్లు పవన్-క్రిష్ సినిమా కోసం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కుస్తీ నేపథ్యంలో సినిమాలో భీకరమైన పోరాట దృశ్యాలుంటాయని, వాటినే క్రిష్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నాడని సమాచారం. మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యమున్న పవన్.. కుస్తీ సన్నివేశాల్లో ఎలా మెరుస్తాడో చూడాలి మరి.