ప్రభాస్ ఫొటోలు.. మహా భాగ్యం

యువి క్రియేషన్స్ అధినేతలు ప్రమోద్-వంశీ అంటే ప్రభాస్‌కు ఎంత అభిమానమో.. వాళ్లకు అతనెంత ప్రయారిటీ ఇస్తాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న వీళ్లను ‘మిర్చి’ సినిమాతో నిర్మాతలుగా మార్చింది ప్రభాసే. అంతే కాదు.. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించాక తొలి సినిమా చేసింది కూడా యువి వాళ్లతోనే. ఆ తర్వాతి చిత్రాన్ని కూడా వాళ్లకే చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు భాగస్వామ్యం కూడా ఉన్నప్పటికీ నిర్మాణ వ్యవహారాలన్నీ యువి వాళ్లే చూసుకుంటారు.

ఐతే యువి వాళ్లతో ఉన్న పెద్ద ఇబ్బందేమంటే.. మేకింగ్ దశలో అభిమానుల్ని అస్సలు ఎంగేజ్ చేసే పనులు పెట్టుకోరు. మిగతా సినిమాల మాదిరి వీళ్ల చిత్రాల నుంచి సమయానుకూలంగా అప్ డేట్లు, అభిమానులకు కానుకలు ఏమీ ఉండవు. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి తమ ఆఫీసు ముందు ఆందోళనలు చేసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు.

ప్రభాస్ కొత్త సినిమా అప్ డేట్, ఫస్ట్ లుక్ కోసం కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. ఐతే లాక్ డౌన్ కారణంగా చూపి ఫస్ట్ లుక్ ఇప్పుడిప్పుడే రిలీజ్ చేసే పరిస్థితి లేదని తేల్చేశారు. అయినా ఫ్యాన్స్ పోరాటం ఆగట్లేదు. వాళ్ల కోసం చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రంగంలోకి దిగాడు. సినిమాకు సంబంధించి అఫీషియల్ లుక్స్, ఇంకే విశేషాలు పంచుకోలేదు కానీ.. ఎప్పుడో ఏడాది కిందట సినిమా ప్రారంభోత్సవం జరిగినప్పటి ఫొటోలను రాధాకృష్ణ ట్విట్టర్లో షేర్ చేశాడు.

కృష్ణం రాజు ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు ప్రభాస్, పూజా హెగ్డేలతో పాటు ప్రభాస్‌కు అత్యంత సన్నిహితుడైన రాజమౌళి కూడా పాల్గొన్నాడు. ఇంకా వి.వి.వినాయక్, కృష్ణంరాజు తదితరులు కనిపించారు ఆ ఫొటోల్లో. ప్రభాస్ చాలా చార్మింగ్‌గా ఉన్నాడీ ఫొటోల్లో. ప్రారంభోత్సవం జరిగినపుడు ఫొటోల్ని కూడా దాచి పెట్టుకుని ఇప్పుడు రిలీజ్ చేయడమేంటి అని కొందరు విమర్శలు గుప్పిస్తుంటే.. ఇప్పుడు ఇవైనా రిలీజ్ చేశారు అదే మహా భాగ్యం అని కొందరు ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.