చ‌క్ర విడుద‌ల‌వుతుందా కాదా?

విశాల్ కొత్త సినిమా చ‌క్ర ఏడెనిమిది నెలల కింద‌టే ఫ‌స్ట్ కాపీతో రెడీ అయింది. కానీ ఆ చిత్రం ఎంత‌కీ విడుద‌ల‌కు మాత్రం నోచుకోలేదు. క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డ్డ ఈ సినిమాను ఒక ద‌శ‌లో ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. జీ5తో ఒప్పందం కూడా అయిపోయింద‌న్నారు. కానీ ఏమైందో ఏమో.. త‌ర్వాత థియేట్రిక‌ల్ రిలీజ్‌కు రెడీ చేశారు. ఈ శుక్ర‌వార‌మే త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తునే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేశారు. ప్ర‌మోష‌న్లు కూడా గ‌ట్టిగా చేస్తున్నారు. కానీ విడుద‌ల‌కు రెండు రోజుల ముందు ఈ చిత్రానికి మ‌ద్రాస్ హైకోర్ట్ బ్రేక్ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాను‌ హీరోగా న‌టించిన యాక్ష‌న్ సినిమాకు సంబంధించి ఆ చిత్ర నిర్మాత ర‌వీంద్ర‌న్‌తో విశాల్‌కు ఉన్న వివాదం చ‌క్ర‌కు శాపంగా మారేలా క‌నిపిస్తోంది. ఈ గొడ‌వ వ‌ల్ల చ‌క్ర శుక్ర‌వారం షెడ్యూల్ ప్ర‌కారం విడుద‌ల‌వుతుందా లేదా అన్న‌ది సందేహంగా మారింది.

విశాల్ చివరి సినిమా ‘యాక్షన్’ను భారీ బడ్జెట్లో నిర్మించి.. సినిమా ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో బాగా నష్టపోయిన రవీంద్రన్ అనే నిర్మాత ‘చక్ర’ విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించడంతో ఇంత‌కుముందే ఈ సినిమాకు బ్రేక్ పడింది. ‘యాక్షన్’ సినిమా బ‌డ్జెట్ విష‌యంలో పూచీక‌త్తుగా ఉన్నవిశాల్ తాను న‌ష్ట‌పోయిన మొత్తం ప‌రిహారం కింద చెల్లించాల‌ని, లేదంటే త‌న‌తో మ‌రో సినిమా చేయాల‌ని ర‌వీంద్ర‌న్ డిమాండ్ చేశాడు. సంబంధిత కేసు విష‌య‌మై కొన్ని రోజుల కింద‌ట రాజీ జ‌రిగి చ‌క్ర విడుద‌ల‌కు మార్గం సుగ‌మం అయిన‌ట్లు క‌నిపించింది. కానీ ఆ గొడ‌వ ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో మ‌ళ్లీ ర‌వీంద్ర‌న్ కోర్టును ఆశ్రయించ‌గా కోర్టు చక్ర విడుద‌లపై స్టే విధిస్తూ విశాల్‌కు నోటీసులు ఇచ్చిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

మ‌రి శుక్ర‌వారం లోపు వివాదాన్ని ప‌రిష్క‌రించుకుని త‌న సినిమా య‌ధావిధిగా విడుద‌ల‌య్యేలా విశాల్ చూసుకుంటాడో లేదో? విశాల్ హిట్ మూవీ ‘ఇరుంబు తిరై‘ (అభిమన్యుడు)కు సీక్వెల్‌‌గా భావిస్తున్న చ‌క్ర చిత్రాన్ని ఆనందన్ అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించాడు.. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ కథానాయిక కాగా.. రెజీనా విలన్ పాత్ర నెగెటివ్ రోల్ చేసింది.