నారా రోహిత్‌తో అన్నాడు.. ఇతడితో చేస్తున్నాడు

‘బాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు పరిశ్రమ దృష్టిని కూడా ఆకర్షించిన దర్శకుడు చైతన్య దంతులూరి. తొలి చిత్రానికి ఓ సాహసోపేతమైన కథను ఎంచుకుని కొత్త హీరో నారా రోహిత్‌ను చాలా భిన్నంగా ప్రెజెంట్ చేశాడతను. దీంతో అతడిపై అంచనాలు పెరిగాయి. రెండో సినిమాతో అతను అంచనాలు అందుకోలేకపోయాడు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ను హీరోగా పెట్టి చైతన్య తీసిన ‘బసంతి’ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఈ దెబ్బతో అతడికి తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.

ఐతే చాలా ఏళ్ల విరామం తర్వాత తన తొలి చిత్ర కథానాయకుడు నారా రోహిత్‌తో ‘అనగనగా దక్షిణాదిలో’ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు చైతన్య. చారిత్రక నేపథ్యంలో భారీ బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి సన్నాహాలు జరిగాయి. టైటిల్, ప్రి లుక్ కూడా రిలీజ్ చేశారు. అవి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి అనుకున్నారు కానీ.. అనుకోకుండా ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. తర్వాత ఇది వార్తల్లోనే లేకుండా పోయింది.

నారా రోహిత్ వరుస ఫెయిల్యూర్లతో అల్లాడిపోతున్న నేపథ్యంలో పెద్ద బడ్జెట్ పెట్టి అతడితో ఈ సినిమా చేయడం సాధ్యపడకే సినిమా ఆగిందేమో అనుకున్నారు. ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత రోహిత్ మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్న నేపథ్యంలో అతను ‘అనగనగా దక్షిణాదిలో’ను పున:ప్రారంభిస్తాడని వార్తలొచ్చాయి. కానీ చైతన్య చూస్తే రోహిత్ క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీ విష్ణుతో ‘భళా తందనాన’ అనే సినిమా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. రాజమౌళి మిత్రుడు సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

మరి రోహిత్ సినిమాను పక్కన పెట్టి చైతన్య విష్ణుతో ఈ సినిమా చేయడమేంటి అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఐతే ఇటు రోహిత్, అటు చైతన్య కెరీర్లు రెండూ దెబ్బ తిని ఉన్న నేపథ్యంలో ఆ భారీ బడ్జెట్ సినిమాను పట్టాలెక్కించడం కష్టమవుతోందని.. ఈ నేపథ్యంలో ముందు ‘భళా తందనాన’తో హిట్టు కొట్టి, ఈలోపు రోహిత్ సైతం ఏదైనా సినిమా చేసి ఫాం అందుకుంటే అప్పుడు ఇద్దరూ కలిసి ‘అనగనగా..’ను మొదలుపెట్టడం తేలికవుతుందని భావిస్తున్నారని సమాచారం.