నిర్మాతగా మాస్ రాజా?


టాలీవుడ్లో చాలా మంది స్టార్ హీరోలకు సొంత బేనర్లు ఉన్నాయి. సొంతంగా నిర్మాణ బాధ్యతలు మోసే హీరోలు కొందరైతే.. వారి కుటుంబాల్లో ఎవరో ఒకరు నిర్మాతలు ఉంటూ బేనర్లను నడిపించడం ఇంకొందరి హీరోల విషయంలో జరుగుతుంటుంది. ఐతే టాలీవుడ్లో సూపర్ స్టార్లు, స్టార్లు చాలామందికి పెద్ద బ్యాగ్రౌండ్ ఉంది. వారి కుటుంబాల్లో అందరూ సినిమాల్లో ఉన్న వాళ్లే కాబట్టి సొంతంగా బేనర్లుండటంలో ఆశ్చర్యమూ లేదు. ఐతే ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సొంతంగా ఎదిగి హీరోగా కొనసాగుతూ కేవలం నటన మీదే దృష్టిపెట్టిన వాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సింది మాస్ రాజా రవితేజ పేరే.

ఆయన పాతికేళ్లకు పైగానే పరిశ్రమలో ఉన్నాడు. ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రస్థానం ఆరంభించి, ఆ తర్వాత నటుడిగా చిన్న చిన్న పాత్రలు వేసి.. ఆపై హీరోగా చిన్న చిన్న సినిమాలు చేసి.. ఆ తర్వాత పెద్ద రేంజికి వెళ్లాడు రవితేజ. ఐతే హీరోగా ఎప్పుడూ పెద్దగా బ్రేక్ తీసుకోకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లిన మాస్ రాజా.. బాగానే వెనకేసుకున్నాడు. పారితోషకం విషయంలో అస్సలు రాజీ పడకుండా హిట్టు కొట్టినపుడల్లా పెంచుకుంటూ పోతూ మంచి స్థాయిని అందుకున్న రవితేజ.. ఇన్నేళ్లలో ఎప్పుడూ ప్రొడక్షన్ గురించి మాత్రం ఆలోచించలేదు.

ఐతే ఎట్టకేలకు ఆయన నిర్మాత అవతారం ఎత్తబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తన పేరు కలిసొచ్చేలా ‘ఆర్‌టీ వర్క్స్’ పేరుతో ఆయన ఒక బేనర్‌ను రిజిస్టర్ చేయించాడట. ఈ బేనర్లో రవితేజ తాను హీరోగా ఏమీ సినిమాలు తీయడట. యంగ్, టాలెంటెడ్ ఆర్టిస్టులను, దర్శకులను పరిచయం చేస్తూ చిన్న, మీడియం బడ్జెట్లో సినిమాలు నిర్మిస్తాడట. ఇన్నేళ్ల తన కెరీర్లో తోడ్పాటు అందించిన వాళ్లకు ఈ బేనర్ ద్వారా అవకాశాలు అందించడంతో పాటు తనలా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చిన యంగ్ టాలెంట్‌కు చేయూత అందించడం కూడా రవితేజ ఈ బేనర్ పెట్టడానికి ఓ కారణమట. తనకు ఎంతో ఇచ్చిన పరిశ్రమకు రవితేజ రుణం తీర్చుకునే పనిలో పడ్డాడని అంటున్నారు టాలీవుడ్ జనాలు.