ప్రొడ్యూసర్ సై! డైరక్టర్‌ నై నై!!

మొదటి సినిమా ‘క్షణం’తోనే తనలోని క్రియేటివిటీని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు డైరెక్టర్ రవికాంత్ పేరెపు. తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న రవికాంత్, బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా నంది అవార్డు కూడా అందుకున్నాడు.

అయితే ‘క్షణం’ సక్సెస్ క్రెడిట్ మొత్తం హీరో అడవి శేష్‌కు వెళ్లడంతో సెకండ్ మూవీ స్టార్ట్ చేసేందుకు రవికాంత్‌కు చాలా టైమ్ పట్టింది. ఎట్టకేలకు ‘గుంటూర్ టాకీస్’ హీరో సిద్ధూ జొన్నలగడ్డతో ‘కృష్ణ అండ్ హీస్ లీల’ అంటూ ఓ యూత్‌ఫుల్ సబ్జెట్ సినిమాను మొదలెట్టాడు ఈ యంగ్ డైరెక్టర్.

కొన్నాళ్లక్రితం రిలీజ్ చేసిన టీజర్‌తో యూత్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగాడు కూడా. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ రాకపోవడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట నిర్మాత సురేశ్ బాబు. ఈ లో-బడ్జెట్ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేయడంతో అమ్మేసుకోవాలని భావిస్తున్నారట.

అయితే తన టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ఛాన్స్‌గా దొరికిన సెకండ్ సినిమాను ఇలా డైరెక్ట్ రిలీజ్ చేయడం దర్శకుడిని ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే లాక్‌డౌన్ ముగిసేవరకూ ఆగుదామని నిర్మాతను ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట రవికాంత్. అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సురేశ్ బాబు దానికి ఒప్పుకోవడం లేదని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా విడుదలపై క్లారిటీ వస్తే, ఈ వార్తల్లో నిజం ఎంతనేది తెలీదు.