రెజీనా నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు రిలీజ్

తెలుగులో ఒక టైంలో క్రేజీ హీరోయిన్‌గా ఉండేది రెజీనా కసాండ్రా. అందానికి అందం, అభినయానికి అభినయం.. రెండూ ఉన్న ఈ భామ పెద్ద రేంజికి వెళ్తుందన్న అంచనాలు కలిగాయి. కానీ రవితేజ, సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్, గోపీచంద్ లాంటి మీడియం రేంజ్ హీరోలతో నటించి.. ఆ స్థాయి నుంచి పైకి వెళ్లలేకపోయింది. ఒక దశ దాటాక మీడియం రేంజ్ సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు కరవయ్యాయి. చివరగా అడివి శేష్‌తో కలిసి చేసిన ‘ఎవరు’ మంచి ఫలితాన్నందుకున్నప్పటికీ తెలుగులో ఆమె కెరీర్ ఊపందుకోలేదు.

ఇక్కడ డౌన్ అయిన టైంలోనే తమిళంలో రెజీనా కొంచెం పుంజుకుంది. అవకాశాలు అందుకుంది. కానీ అక్కడ కూడా వరుసగా పరాజయాలు పలకరించేసరికి రెజీనా కెరీర్ డోలాయమానంలో పడింది. ఆమె కెరీర్‌ను మలుపు తిప్పుతుందనుకున్న ఓ సినిమా నిరవధికంగా వాయిదా పడటం కూడా ప్రతికూలంగా మారింది. ఐతే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రెజీనా, ఎస్జే సూర్య, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా.. నెంజం మరప్పుదిల్లై. తమిళంలో ఇప్పటిదాకా రాని ప్రయోగాత్మక కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా మొదలైనపుడు.. మేకింగ్ టైంలో, ట్రైలర్ వచ్చినపుడు ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేగింది. ట్రైలర్ షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చింది. సూర్య ఒక సైకో తరహా పాత్ర పోషించాడిందులో. రెజీనా, నందితల పాత్రలూ కొత్తగా అనిపించాయి. ఈ సినిమా వీళ్లందరి కెరీర్లలోనూ గేమ్ చేంజర్ అవుతుందనుకుంటే.. ఏవేవో కారణాలతో విడుదల కాకుండా ఆగిపోయింది.

చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. మధ్యలో సెల్వ.. సూర్య హీరోగా ‘ఎన్జీకే’ అనే సినిమా కూడా తీశాడు. ఇక ఈ చిత్రం విడుదలే కాదని అనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మార్చి 5న ‘నెంజం మరప్పుదిల్లై’ విడుదల కానుంది. తమిళంలో మంచి ఫలితాన్నందుకుంటే తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.