గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి నాలుగు నెలలు దాటిపోయింది. ఇంకా కూడా ఆయన పేరు తలిస్తే అభిమానులు తీవ్ర ఉద్వేగానికి, ఆవేదనకు లోనవుతున్నారు. సంగీత దర్శకుడిగా బాలు మీద మరింత అభిమానం పెంచుకున్న దేవిశ్రీ ప్రసాద్.. తన తండ్రి సత్యమూర్తి మరణం తర్వాత తనను అంతగా బాధ పెట్టిన మరణం బాలుదే అంటూ ఓ ఇంటర్వ్యూలో ఉద్వేగానికి గురయ్యాడు.
ఇళయరాజాను, బాలును తాను దేవుళ్ల లాగే కొలుస్తానని, వారు లేకుంటే సినిమా పాటే లేదన్నది తన ఉద్దేశమని అన్న దేవిశ్రీ ప్రసాద్.. తనకు చిన్నతనంలో సంగీతం మీద అభిరుచి పుట్టినప్పటి నుంచి బాలుతో ఒక పాట పాడించాలని కలలు కన్నానని, సంగీత దర్శకుడిగా తన తొలి చిత్రం దేవితోనే ఆ కోరిక తీరిపోయిందని చెప్పాడు. బాలు ప్రతి పుట్టిన రోజుకూ ఆయనింటికి తాను వెళ్లేవాడినని అతను వెల్లడించాడు.
తాను స్వరపరిచిన, పాడిన పాటల్లో నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ అంటే బాలుకు ఎంతో ఇష్టమని.. ఆ పాటను ఆయన గాత్రంతో, తన స్టూడియోలో రికార్డు చేయాలని అనుకున్నారని, గత ఏడాది తన తండ్రి సత్యమూర్తి జయంతి రోజు ఈ పని చేయాలని ఇద్దరం బావించామని, కానీ కరోనా వల్ల అది సాధ్యపడలేదని దేవి చెప్పాడు. ఆ తర్వాత బాలు అకాల మరణంతో తమ ఇద్దరి కోరిక తీరకుండా మిగిలిపోయిందని దేవి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉప్పెన సినిమాలోనూ ఒక పాటను బాలుతో పాడించాలని అనుకున్నానని.. కానీ అదీ సాధ్యపడలేదని అతను చెప్పాడు. కొన్ని రోజుల కిందట రిలీజ్ చేసిన రంగులద్దుకున్న పాటను బాలు విని ఉంటే కచ్చితంగా తనను అభినందించేవాడని, అందుకే ఆయనకు ఆ పాటను అంకితమిచ్చానని దేవి తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates