ప్ర‌భాస్‌కు ఫ్యాన్స్‌కు ప్ర‌శాంత్ తీపి క‌బురు

ప్ర‌భాస్ కొత్త సినిమా స‌లార్‌పై అంచ‌నాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. కేజీఎఫ్ సినిమాతో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించిన ప్ర‌శాంత్ నీల్ త‌న‌దైన శైలిలో తెర‌కెక్కిస్తున్న పూర్తి స్థాయి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. కేజీఎఫ్ చూసిన‌పుడే ఇందులో ప్ర‌భాస్ హీరో అయితే అని.. ఇలాంటి డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్‌తో జ‌ట్టు క‌డితే అని ఊహ‌ల్లోకి వెళ్లిపోయారు ఫ్యాన్స్. ఆ ఊహ ఇంత త్వ‌ర‌గా సాధ్య‌మ‌వుతుంద‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు.

ఉన్న‌ట్లుండి సినిమాను అనౌన్స్ చేసి, పెద్ద‌గా ఆల‌స్యం చేయ‌కుండానే షూటింగ్ కూడా మొద‌లుపెట్టేశాడు ప్ర‌శాంత్. తొలి షెడ్యూల్ జోరుగా న‌డుస్తుండ‌గా.. ఇంత‌లో ఓ మీడియా సంస్థ‌తో స‌లార్ ముచ్చ‌ట్లు పంచుకున్నాడు ప్ర‌శాంత్. ఇందులో ప్ర‌భాస్ అభిమానుల‌కు ఉత్తేజం క‌లిగించే కొన్ని విష‌యాలు చెప్పాడు.

ప్ర‌భాస్‌తో ప్ర‌శాంత్ తీస్తున్న‌ది.. ద‌ర్శ‌కుడిగా అత‌డి తొలి సినిమా ఉగ్రంకు రీమేక్ అనే ప్ర‌చారం ముందు నుంచి ఉంది. ఆ క‌థ‌కు భారీత‌నం జోడించి ఇప్పుడు ప్ర‌భాస్‌తో తీస్తున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. ఐతే స‌లార్ రీమేక్ కానే కాద‌ని ప్ర‌శాంత్ తేల్చేశాడు. ఉగ్రం అనే కాదు.. మ‌రే హాలీవుడ్, బాలీవుడ్ సినిమాకు కూడా ఇది రీమేక్ కాద‌ని.. ఇది కేవ‌లం ప్ర‌భాస్‌ను దృష్టిలో ఉంచుకుని, అత‌డికి మాత్ర‌మే సూట‌య్యేలా రాసిన క‌థ అని ప్ర‌శాంత్ వెల్ల‌డించాడు.

ఇక సినిమా రిలీజ్ గురించి కూడా ప్ర‌శాంత్ ఈ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు క‌ల్లా షూటింగ్ పూర్తి చేయాల‌ని అనుకుంటున్నామ‌ని.. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాల‌న్న‌ది త‌మ ప్ర‌ణాళిక అని ప్ర‌శాంత్ వెల్ల‌డించాడు. స‌లార్ సంక్రాంతికి రావొచ్చ‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారం న‌డుస్తుండ‌గా.. ఇప్పుడు స్వ‌యంగా ద‌ర్శ‌కుడి నోటి నుంచే ఆ మాట రావ‌డం ప్ర‌భాస్ అభిమానుల‌కు ఎంతో ఉత్సాహాన్నిచ్చేదే.