ఆచార్య సినిమా నైజాం హక్కులు రూ.42 కోట్లు.. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో, మీడియాలో, అలాగే టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్. బాహుబలితో తిరుగులేని మార్కెట్ సంపాదంచుకున్న ప్రభాస్ సినిమాకో.. లేదంటే ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి కొత్త చిత్రానికో ఈ రేటు పలికి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. కానీ చిరంజీవి-కొరటాల శివ కలయికలో రానున్న మామూలు సినిమాకు ఈ రేటు అనేసరికి నమ్మశక్యంగా అనిపించట్లేదు జనాలకు.
క్రాక్ సినిమాను నైజాంలో రిలీజ్ చేసి భారీగా లాభాలందుకున్న వరంగల్ శ్రీను రికార్డు స్థాయి రేటుతో ఆచార్య నిర్మాత రామ్ చరణ్‌ను పడేశాడని, దీంతో దిల్ రాజు సహా ఎవరూ పోటీలో లేకుండా పోయారని, మరో ఆలోచన లేకుండా హక్కులు రాసిచ్చేశారని అంటున్నారు. ఐతే చిరు సినిమాకు నైజాం హక్కులు మరీ రూ.42 కోట్లు పలికే రేంజ్ ఉందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
నాన్ బాహుబలి సినిమాల్లో ఇప్పటిదాకా అత్యధిక షేర్ సాధించిన సినిమా అంటే అల వైకుంఠపురములోనే. ఆ సినిమా రూ.40 కోట్ల మేర షేర్ రాబట్టింది. ఐతే దానికి గత ఏడాది సంక్రాంతి సీజన్లో అన్నీ భలేగా కలిసొచ్చాయి. ఆ సినిమా ఆ రేంజికి వెళ్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఇక చిరు సినిమాల్లో అత్యధిక నైజాం షేర్ అంటే.. సైరా సాధించిన రూ.33 కోట్లే. అది ఒక చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. దాని బడ్జెట్, బిజినెస్ కూడా చాలా ఎక్కువ. అలాంటిది ఆచార్య లాంటి సోషల్ మూవీకి ఈ రేటు అంటే చాలా ఎక్కువ అన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇంత మొత్తం రికవరీ అన్నది చాలా చాలా కష్టమని.. సినిమా మెగా బ్లాక్‌బస్టర్ కావాల్సిందే అని అంటున్నారు. నిజంగా అంత మొత్తం షేర్ రాబడితే చిరు ది గ్రేట్ అని అనకుండా ఉండలేం.