సినిమా రిలీజ్‌పై విశాల్ యు ట‌ర్న్‌


తెలుగు వాడైన త‌మిళ యాక్ష‌న్ హీరో విశాల్ గ‌త ఏడాది క‌రోనా కంటే ముందే ‘చ‌క్ర’ అనే సినిమాను పూర్తి చేశాడు. లాక్ డౌన్ టైంలో దాని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. వ‌రుస‌గా కొత్త సినిమాల‌న్నీ ఓటీటీ బాట ప‌డుతున్న స‌మ‌యంలో ‘చ‌క్ర’‌ను కూడా అదే త‌ర‌హాలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు గ‌ట్టి ప్ర‌చారం జ‌రిగింది.

ఓటీటీల్లో కొత్త సినిమాల సంద‌డి నెల‌కొన్న స‌మ‌యంలోనే ఈ సినిమా ట్రైల‌ర్ కూడా లాంచ్ చేశారు. దీంతో అది డిజిట‌ల్ రిలీజ్‌కు రెడీ అయిపోయింద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. జీ5 వాళ్లు ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమాను కొనేశార‌ని, పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నార‌ని వార్త‌లొచ్చాయి. రిలీజ్ డేట్ గురించి కూడా మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. కానీ ఎంత‌కీ ఈ సినిమా విడుద‌ల కాలేదు. చూస్తుండ‌గానే నెల‌లు నెల‌లు గ‌డిచిపోయాయి.

ఐతే ఇప్పుడు విశాల్ వ‌చ్చి కొత్త క‌బురు చెప్పాడు. ఉన్న‌ట్లుండి ‘చక్ర’ సినిమా థియేట్రిక‌ల్ రిలీజ్‌కు రెడీ అయిన‌ట్లు వెల్ల‌డించాడు. రెండు మూడు రోజులుగా మీడియాలో ఈ దిశ‌గానే వార్త‌లొస్తున్నాయి. విశాల్ స్వ‌యంగా ట్విట్ట‌ర్లో ఈ ప్ర‌చారాన్ని ధ్రువీక‌రించాడు. త‌న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతున్న మాట వాస్త‌వ‌మే అని.. ఫిబ్ర‌వ‌రి 19న ఈ చిత్రాన్ని త‌మిళంతో పాటు మిగ‌తా మూడు ద‌క్షిణాది భాష‌ల్లోనూ ఈ సినిమా భారీ స్థాయిలో విడుద‌ల కానుంద‌ని విశాల్ ప్ర‌క‌టించాడు. దీంతో ఉన్నట్లుండి విశాల్ ఇలా యు టర్న్ తీసుకున్నాడేమిటి అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.

తెలుగులో ‘సోలో బ్రతుకే సో బెటర్’ తరహాలోనే జీ గ్రూప్ వాళ్లు సినిమాను హోల్‌సేల్‌గా కొనేసి ముందు థియేటర్లలో ఆ తర్వాత డిజిటల్, శాటిలైట్ రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్నారా.. లేక వారితో డీల్ క్యాన్సిల్ అయి విశాల్ ఈ చిత్రాన్ని ముందు థియేటర్లలో రిలీజ్ చేయించి వేరుగా డిజిటల్, శాటిలైట్ హక్కులు అమ్ముతాడా అన్న దానిపై స్పష్టత లేదు. ఆనందన్ అనే దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని విశాల్ హిట్ మూవీ ‘ఇరుంబు తిరై‘ (అభిమన్యుడు)కు సీక్వెల్‌‌గా భావిస్తున్నారు. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ కథానాయిక కాగా.. రెజీనా విలన్ పాత్ర పోషించినట్లు సమాచారం.