సందీప్ వంగా ఫ్యానిజం మళ్ళీ బయటపడింది

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డితో మొదలుపెట్టి యానిమల్ దాకా తీసింది అతి తక్కువ సినిమాలే అయినా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా విపరీతంగా అభిమానించే ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. అందుకే స్పిరిట్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవలం సందీప్ వంగ నిర్మాతగా వ్యవహరించిన కారణం వల్ల రోమాంచకంకు అంత బిజినెస్ జరిగింది, నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థ కొనుక్కుంది.

ఇదిలా ఉంచితే సందీప్ వంగాకు చిరంజీవి మీద ఎంత ఫ్యానిజం ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చిన్నతనంలో మెగాస్టార్ ప్రభావం తన మీద ఏ స్థాయిలో ఉండేదో కథలు కథలుగా చెబుతారు. ఫలానా ఖైదీ నెంబర్ 786 ఫలానా మాస్టర్ అంటూ చిరు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు, తాగిన సిగరెట్, వేసుకున్న చొక్కా రంగు ఇలా ఏ డీటెయిల్ మిస్ కాకుండా వర్ణించడం ఆయనకే చెల్లు. ఈ వీడియోలు ఎక్స్ ఇన్స్ టాలో బాగా వైరల్ కూడా అయ్యాయి. ఆఫీస్ గుమ్మంలో ఏకంగా నిలువెత్తు చిరు ఫోటోనే ఉంటుంది.

తాజాగా ఒక బాలీవుడ్ జర్నలిస్టుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ వంగా మాట్లాడుతూ చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టిల శరీర తత్వం, వాళ్ళు పడే కష్టం చూస్తే ఆల్ ప్యాచీనో, రాబర్ట్ డేనిరో లాంటి అత్యుత్తమ నటుల కంటే గొప్పగా ఉంటారని, కావాలంటే వాళ్ళ సినిమాలు చూడమని చెప్పడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే సందీప్ చేసిన పోలిక ఆషామాషీది కాదు. హాలీవుడ్ ప్రియులకు కోపం తెప్పిస్తుంది కూడా. అయినా సరే నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పేశారు.

ఈ క్లిప్పు ఇప్పుడు తెగ తిరగేస్తోంది. ఇదంతా ఓకే కానీ వీలైనంత త్వరగా సందీప్ వంగ, చిరంజీవి కాంబోలో ఒక సినిమా రావాలని మెగా ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. కథ కుదిరితే నిజంగా చేయడానికి ఇద్దరు రెడీగానే ఉన్నారు కానీ దానికి సరైన సమయం రావాలి. స్పిరిట్ తర్వాత సందీప్ నెక్స్ట్ యానిమల్ పార్క్ చేస్తారా లేక ఇంకేదైనా కొత్త కమిట్ మెంట్ తీసుకుంటారా అనేది ఇంకా తేలలేదు. మహేష్ బాబుతో ఉండొచ్చనే టాక్ ఉంది కానీ ఏది నిర్ధారణ కాలేదు. స్పిరిట్ అక్టోబర్ లో విడుదల కానుంది.