ఈ వారం కొత్త సినిమా భోగిని టీమ్ గట్టిగా ప్రమోట్ చేస్తూ వస్తోంది కొన్ని రోజులుగా. ఐతే ఈ సినిమా ఈవెంట్లలో, ఇతర ప్రమోషన్లలో ఎక్కడా లీడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తెలుగులో ఈ సినిమా చేసినా ప్రమోషన్లకు బాగా సహకరిస్తుంది అనుపమ. గత నెలలో క్రేజీ కళ్యాణంను కూడా బాగా ప్రమోట్ చేసింది. కానీ భోగి సినిమాను మాత్రం పట్టించుకోలేదు.
ఈవెంట్లకు హాజరు కాకపోవడమే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి ఒక పోస్టు కూడా పెట్టలేదు అనుపమ. ఓవైపు సెకండ్ హీరోయిన్ అయిన డింపుల్ హయాతి అగ్రెసివ్ గా సినిమాను ప్రమోట్ చేస్తుంటే మెయిన్ హీరోయిన్ అనుపమ మాత్రం ఎందుకిలా మౌనంగా ఉంటోంది అని అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే ఈ చర్చకు ముగింపు పలుకుతూ అనుపమ స్పందించింది.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో భోగి రిలీజ్ గురించి అనుపమ పోస్టు పెట్టింది. ఈ సినిమా రిలీజ్ డేట్లు పలుమార్లు మారడంతో తన డేట్లను సర్దుబాటు చేయడానికి ఎంతో ప్రయత్నించానని.. అయితే ముందుగా ఒప్పుకున్న మరో సినిమా షూటింగ్ కోసం తాను ఊటీకి వెళ్లాల్సి రావడంతో ప్రమోషన్లకు హాజరుకాలేకపోయానని వివరించింది.
ఈ నేపథ్యంలో తన పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించిన ‘భోగి’ చిత్ర బృందానికి ఆమె కృతజ్ఞతలు చెప్పింది. తాను భౌతికంగా అక్కడ లేకపోయినా తన మనసు ఎప్పుడూ చిత్ర యూనిట్తోనే ఉంటుందని ఆమె పేర్కొంది. ఐతే ఈ సంగతి కొంచెం ముందే చెప్పి ఉంటే ఊహాగానాలకు అవకాశం లేకపోయేది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది రూపొందించిన ఈ చిత్రాన్ని రాధామోహన్ నిర్మించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates