పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలై మూడేళ్లు దాటిపోయింది. 2018లో ‘అజ్ఞాతవాసి’తో పలకరించిన అతను.. ఆ తర్వాత రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించడం, ఒక దశలో మళ్లీ సినిమాలు చేయనని ప్రకటన కూడా చేయడం.. 2019 ఎన్నికల తర్వాత కొన్ని నెలలకు మనసు మార్చుకుని రీఎంట్రీకి రెడీ అవడం, ముందుగా ‘వకీల్ సాబ్’ను మొదలుపెట్టడం తెలిసిన సంగతే.
కరోనా లేకుంటే గత ఏడాది వేసవిలోనే పవన్ రీఎంట్రీ మూవీ చూసేవాళ్లం. కానీ ఆ మహమ్మారి కారణంగా పవన్ పునరాగమనం ఇంకో ఏడాది ఆలస్యం అయింది. మూడేళ్లకు పైగా విరామం తర్వాత ఏప్రిల్‌లో ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు పవర్ స్టార్. ఐతే మూడేళ్ల గ్యాప్ వల్ల అభిమానులు కోల్పోయిన ఆనందాన్ని వడ్డీతో కలిపి ఇచ్చేయడానికి పవన్ రెడీ అయినట్లే ఉంది. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో పవన్ మూడు సినిమాలను థియేటర్లలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘వకీల్ సాబ్’ వచ్చిన నాలుగు నెలలకు మరో సినిమా, ఆ తర్వాత నాలుగు నెలలకు ఇంకో సినిమా పవన్ నుంచి రాబోతున్నాయన్న కబురు అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. ‘వకీల్ సాబ్’ను పూర్తి చేసిన కొన్ని రోజులకే, ఇటీవలే ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ను పవన్ పట్టాలెక్కించాడు. దీంతో పాటుగా క్రిష్ సినిమాలో ఆయన నటించనున్నాడు. ‘అయ్యప్పనుం..’ రీమేక్‌ను మూణ్నాలుగు నెలల్లోనే పూర్తి చేసి ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తారని అంటున్నారు.
క్రిష్ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతున్నదే కానీ.. ఎంత భారీ చిత్రమైనప్పటికీ అతనేమీ రాజమౌళిలా ఏళ్లకు ఏళ్లు సినిమా తీయడు. ఈ ఏడాది చివరి లోపే ఆ సినిమా పూర్తయ్యే అవకాశాలున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కూడా 2021లోనే పూర్తి చేసి 2022 సంక్రాంతి రేసులో ఈ చిత్రాన్ని నిలిపే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే ఈ ఏప్రిల్ మధ్య నుంచి 2022 జనవరి మధ్య లోపు ఎనిమిది నెలల వ్యవధిలో పవన్ సినిమాలు మూడు రిలీజవుతాయన్నమాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates