అదరగొట్టిన ఆహా!

వ్యాపారంలో కాస్త లాభం వున్నా కానీ దానిని వదులుకోవడానికి వ్యాపారస్తులు ఇష్టపడరు. డిజిటల్‍ డీలింగ్స్ లో భాగంగా ఒక సినిమా విడుదల కాకముందే దానిని ఫలానా రోజున స్ట్రీమింగ్‍లో పెట్టుకునేట్టుగా ఒప్పందం జరుగుతుంది. ఒకవేళ ఆ సినిమా పెద్ద హిట్టయి వసూళ్లు అద్భుతంగా వస్తున్నా కానీ ఒప్పందం అయితే జరిగిపోయింది కాబట్టి థియేట్రికల్‍ రన్‍తో సంబంధం లేకుండా స్ట్రీమింగ్‍లో పెట్టేస్తుంటారు. అందులో తప్పేమీ లేదు. అది వారి హక్కు కూడా. అయితే సినిమా ఎంత ఆడుతుంది, ఎన్నాళ్లు వసూళ్లు రాబడుతుందనేది ముందే ఊహించడం కష్టం. అలాంటి టైమ్‍లోనే సదరు సినిమా కనుక మంచి వసూళ్లు తెచ్చుకుంటూ వుంటే స్ట్రీమింగ్‍ ప్లాట్‍ఫామ్‍ డిజిటల్‍ రిలీజ్‍ వాయిదా వేసుకుంటే బాగుంటుంది.

ఇంటర్నేషనల్‍ బ్రాండింగ్‍ వున్న కంపెనీలు అందుకు ససేమీరా ఒప్పుకోవు. కానీ అచ్చంగా తెలుగు కంటెంట్‍ని ప్రమోట్‍ చేయడానికే ఉద్భవించిన ఆహా మొదటిసారిగా ఒక పెద్ద సినిమా హక్కులు తీసుకుంది. క్రాక్‍ సినిమా హక్కులు తీసుకున్న ఆహాకు ఆ సినిమా ఘన విజయం సాధించడం పెద్ద బోనస్‍. ఇలాంటి టైమ్‍లో ఆ సినిమాను ఎంత త్వరగా ప్రదర్శనకు పెట్టగలిగే వీలుంటే అంత త్వరగా ఆ అవకాశాన్ని వాడేసుకోవాలి. కానీ స్వార్ధానికి పోకుండా ‘క్రాక్‍’ విడుదల వారం రోజుల పాటు వాయిదా వేసి ఫిబ్రవరి 5 నుంచి స్ట్రీమింగ్‍ పెడుతున్నట్టు ప్రకటించి తెలుగు చిత్ర పరిశ్రమ మనసు గెలుచుకుంది. ఇప్పటికే లోకల్‍ బ్రాండింగ్‍తో ఆకట్టుకుంటోన్న ఆహా ఇలా పట్టువిడుపులు చూపించి మరింత మంది నిర్మాతలను ఆకట్టుకుంటోంది.