బుచ్చిబాబుకు ఒక్కో ఈవెంట్‌కు 10 వేలిచ్చినా…

కొన్ని నెలల ముందు ‘పెద్ది’ సినిమాతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు బుచ్చిబాబు సానా. ఐతే ఆ సినిమా అంతిమంగా ఆశించిన ఫలితాన్నివ్వలేకపోయింది. దీంతో కొన్ని రోజులు బుచ్చిబాబు మీడియా ఫోకస్‌కు దూరంగా ఉన్నాడు. కానీ ఈ మధ్య బుచ్చిబాబు మళ్లీ మీడియాలో బాగా హైలైట్ అవుతున్నాడు. అందుక్కారణం.. తరచుగా సినిమా ఈవెంట్లలో కనిపిస్తుండడమే. ఓవైపు ఓపెనింగ్స్, ఇంకోవైపు ప్రి రిలీజ్ ఈవెంట్లలో బుచ్చిబాబు సందడి చేస్తున్నాడు.

ముఖ్యంగా తనకు హోం బేనర్ అనదగ్గ మైత్రి మూవీ మేకర్స్‌కు సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా.. బుచ్చిబాబు ఉండాల్సిందే. మొన్న రామ్ చరణ్, సుకుమార్ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న బుచ్చిబాబు.. నిన్న ‘దొంగ నా కొడుకు’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో తళుక్కుమన్నాడు. ఇలా మైత్రి వారి ప్రతి ఈవెంట్లో పాల్గొనడం గురించి బుచ్చిబాబు భలే సరదా కామెంట్ చేశాడు.

మైత్రి అధినేత రవిశంకర్.. ఈ సంస్థకు సంబంధించిన ప్రతి ఈవెంట్‌కూ పిలుస్తారని.. ఆయన పిలిస్తే రాకుండా ఉండలేమని.. ఇలా పిలిచే ఒక్కో ఈవెంట్‌కు రూ.10 వేల చొప్పున ఇచ్చినా, ఈపాటికి కోకాపేటలో ఒక ఫ్లాట్ కొనేసేవాడినని బుచ్చిబాబు వ్యాఖ్యానించడం విశేషం. ఈ కామెంట్‌తో ఆడిటోరియం నవ్వుల్లో మునిగిపోయింది. రవిశంకర్ సైతం గట్టిగా నవ్వారు.

బుచ్చిబాబు ప్రస్తుతం తన కొత్త చిత్రానికి కథ తయారు చేసుకునే పనిలో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి సహా కొందరు పెద్ద హీరోల మీద బుచ్చిబాబు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా అతను పెద్ద బడ్జెట్ సినిమానే చేసే అవకాశముంది. ‘పెద్ది’ కొంచెం అటు ఇటు అయినప్పటికీ.. మైత్రి అధినేతలకు బుచ్చిబాబు మీద నమ్మకం ఏమీ సడలిపోలేదు. చరణ్, సుకుమార్ సినిమా ఈవెంట్‌కు వచ్చినపుడు కూడా రవిశంకర్ మాట్లాడుతూ.. ఈసారి బుచ్చిబాబు గట్టిగా బౌన్స్ బ్యాక్ అవుతాడని ధీమాగా చెప్పారు.