‘ఈసారి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే గెలిచినా… నా రాజకీయ సన్యాసమే’

వైసీపీ నాయ‌కులు వెంక‌ట‌న్నా అని పిలుచుకునే అనంత‌పురం వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి తాజాగా పెద్ద స‌వాలే విసిరారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ఒక్క ఎమ్మెల్యే కూడా విజయం ద‌క్కించుకోర‌ని చెప్పారు. అందతేకాదు.. ఒక్క ఎమ్మెల్యే గెలిచినా.. తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని వెల్ల‌డించారు. అయితే.. రాజ‌కీయాల్లో ఉన్న వారు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. అనంత‌పురం కార్పొరేష‌న్‌ను మాత్ర‌మే వైసీపీ గెలుచుకుంద‌న్న విష‌యాన్ని అనంత మ‌రిచిపోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఒక్క గెలుపుతో ఇంత భారీ స‌వాల్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. అంతేకాదు.. అస‌లు ఇక్క‌డ టీడీపీ పోటీ చేసి ఉంటే ఫ‌లితం వేరేగా ఉండేద‌ని కూడా చెబుతున్నారు. పైగా.. అనంత‌పురంలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో ద‌క్కించుకోలేద‌న్న వాస్త‌వాన్ని వెంక‌ట్రామిరెడ్డి మ‌రిచిపోతున్నారా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. వాస్త‌వ ప‌రిస్థితిని అంచ‌నావేస్తే.. అనంత‌లో ఏం జ‌రిగింద‌న్న‌ది తెలుస్తుంద‌ని చెబుతున్నారు. నిజానికి అనంత‌పై టీడీపీ నేత‌లు ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. కానీ.. కార్పొరేషన్‌ మాత్ర‌మే వైసీపీ ద‌క్కించుకుంది.

ఇది మిన‌హా చెప్పుకోద‌గ్గ స్థాయిలో కార్పొరేట్ స్థానాల‌ను నెగ్గించుకోలేక పోయింది. దీనికి వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముడిపెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. అప్ప‌టి ప‌రిస్థితులు, ప‌రిణామాలు భిన్నంగా ఉంటాయ‌ని చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు, స‌వాళ్లు చేసిన నాయ‌కులు అడ్ర‌స్ లేకుండా పోయార‌ని గుర్తు చేస్తున్నారు. పైగా.. టీడీపీ నేత‌ల‌కు ఒక ల‌క్ష‌ణం ఉంది. తమ‌ను రెచ్చ‌గొడితే మ‌రింత ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేస్తారు. గ‌తంలో ఇదే జ‌రిగింది.

సో.. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు.. పైగా సీనియ‌ర్ వంటి అనంత ఇలాంటిస‌వాళ్లు చేయ‌డం త‌గ‌ద‌ని చెబుతున్నారు. పార్టీ ప‌రంగా మ‌రింత పుంజుకోవాల్సిన అవ‌స‌రం తాజా ఎన్నిక‌లు చాటి చెబుతున్నాయి. 2019కి ముందు.. ఇప్పుడున్న ప‌రిస్థితులను అంచ‌నా వేసుకుని నాయ‌కులు ముందుకు సాగ‌క‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని కూడా హెచ్చ‌రిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది స‌వాళ్లు కాద‌ని, ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా.. పార్టీని వారికి చేరువ చేసేలా ప‌టిష్ఠ‌మైన ప్ర‌ణాళిక‌లు, వ్యూహాలేన‌ని తేల్చి చెబుతున్నారు. ఆ దిశ‌గా ఆలోచ‌న చేయాల‌ని సూచిస్తున్నారు.