ఇలాంటి టాక్‌తో 200 కోట్ల వ‌సూళ్లా?

కొన్నేళ్లుగా త‌మిళ‌నాట విజ‌య్ సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ షేక్ అయిపోతోంది. టాక్‌తో సంబందం లేకుండా అత‌డి సినిమాలు భారీ వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి. మెర్స‌ల్ సినిమాకు మ‌రీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. అది చాలాసార్లు చూసిన క‌మ‌ర్షియ‌ల్ సినిమాల రీహ్యాష్ లాగే ఉంటుంది. ఆ సినిమా రూ.200 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ట్ చేసి ఔరా అనిపించింది.

స‌ర్కార్ సైతం భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇక చివ‌ర‌గా అత‌డి నుంచి వ‌చ్చిన బిగిల్ సైతం రొటీన్ సినిమానే అయినా.. వ‌సూళ్ల‌కు ఢోకా లేక‌పోయింది. ఇప్పుడు బాక్సాఫీస్‌కు అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలో విడుద‌లైన అత‌డి కొత్త చిత్రం మాస్ట‌ర్ సాధిస్తున్న వ‌సూళ్లు ఔరా అనిపిస్తున్నాయి. వ‌ర‌ల్డ్ వైడ్ ఈ చిత్ర గ్రాస్ వ‌సూళ్లు రూ.200 కోట్ల మార్కును ట‌చ్ చేసిన‌ట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.

ఒక్క త‌మిళ‌నాడులో మాత్ర‌మే మాస్ట‌ర్ రూ.100 కోట్ల మార్కును ఆల్రెడీ దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్ల దాకా గ్రాస్ వ‌చ్చింది. ఇక మ‌ల‌యాళంలో విజ‌య్ సినిమాలు త‌మిళ‌నాడు త‌ర‌హాలోనే ఆడ‌తాయి. అక్క‌డ గ్రాస్ భారీగానే వ‌చ్చింది. క‌ర్ణాట‌క‌లోనూ ఈ సినిమా జోరు కొన‌సాగుతోంది. ఉత్త‌రాదిన సైతం మాస్ట‌ర్ డ‌బ్బింగ్ వెర్ష‌న్‌ను పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు.

క‌రోనా విరామం త‌ర్వాత విదేశాల్లో అత్యంత భారీగా విడుద‌లైన చిత్రం ఇదే. అన్ని చోట్లా టాక్‌తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుస్తున్న స‌మ‌యంలో డివైడ్ టాక్ తెచ్చుకున్న ఓ ప్రాంతీయ చిత్రానికి రూ.200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లంటే సామాన్య‌మైన విష‌యం కాదు. విజ‌య్ ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగిపోయాడో చెప్ప‌డానికి ఇది తాజా ఉదాహ‌ర‌ణ‌. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చి ఉంటే విజ‌య్ జోరు ఇంకెలా ఉండేదో?