థియేటర్లు పునఃప్రారంభమై, మళ్లీ ప్రేక్షకులు థియేటర్లు రావడం మొదలవగానే టాలీవుడ్ నిర్మాతలు ఏమాత్రం ఆలస్యం చేయట్లేదు. ఆల్రెడీ విడుదల కోసం చూస్తున్న సినిమాలు, మధ్యలో పూర్తయినవి, త్వరలో పూర్తి కాబోయేవి.. ఇలా చాలా సినిమాలు లైన్లో ఉండటంతో రిలీజ్ డేట్‌లు ఖరారు చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. వేసవికి అప్పుడే దాదాపుగా అన్ని బెర్తులు బుక్ అయిపోయాయి. అన్ సీజన్ అనదగ్గ ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా సినిమాల సందడి తక్కువగా ఏమీ ఉండేలా లేదు.
ఫిబ్రవరి తొలి రెండు వారాల్లో ఉప్పెన, జాంబీ రెడ్డి, ఎ1 ఎక్స్‌ప్రెస్, శశి లాంటి సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి నెల చివర్లో రంగ్‌దె, అరణ్య రాబోతున్నాయి. మధ్యలో ఖాళీ దొరికిన వారాలకు కూడా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు ఫిక్స్ అవుతున్నాయి.
ఫిబ్రవరి 19న నితిన్-చంద్రశేఖర్ యేలేటిల చెక్‌ను ఫిక్స్ చేశారు.
ఇప్పుడు శర్వానంద్ సినిమా శ్రీకారం విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ చిత్రం మార్చి 11న మహా శివరాత్రి కానుకగా విడుదల కానున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్రకటించింది. శర్వాకు ఈ సినిమా విజయం సాధించడం చాలా అవసరం. పడి పడి లేచె మనసు, రణరంగం, జాను లాంటి డిజాస్టర్లతో అతను రేసులో బాగా వెనుకబడిపోయాడు. శ్రీకారం టైటిల్, పోస్టర్లు, ఇతర ప్రోమోలు చూస్తే శతమానం భవతి తరహా సినిమాలా కనిపిస్తోంది.
ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఉంటే పర్ఫెక్ట్ టైమింగ్ అయ్యేదని, మంచి ఫలితాన్నందుకునేదని ఇండస్ట్రీ జనాల అభిప్రాయం. కానీ అప్పటికి సినిమాను సిద్ధం చేయలేకపోయారు. వేసవికి విపరీతమైన పోటీ ఉండటంతో మధ్యే మార్గంగా మహాశివరాత్రికి సినిమాను విడుదల చేయబోతున్నారు. కిషోర్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో శర్వా సరసన ప్రియాంక మోహన్ నటించింది.