టైసన్ నాయుడు… నిద్ర లేచాడు

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ లాంటి మాస్ బ్యాకప్ ఉన్న హీరో సినిమా మూడేళ్లకు పైగా మోక్షం దక్కించుకోకుండా ల్యాబులోనే మగ్గుతూ ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. టైసన్ నాయుడు గురించి అభిమానులు ఎన్నిసార్లు అనుమాన పడ్డారో, అసలు వస్తుందో రాదో అనుకున్నారో కానీ, అంతకంతా ఆలస్యమవుతూ వెళ్తోంది తప్ప బయటికి వచ్చే మార్గం కనిపించలేదు. టీజర్ రిలీజైన సంగతే ఎవరికీ గుర్తు లేదంటే ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాని ఇదేదో ఆషామాషి మూవీ కాదు.

టైసన్ నాయుడు తీసింది 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ. లెజెండ్, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్స్ వీళ్ళ కథలో ఉన్నాయి. తర్వాత ఫ్లాపులు ఆర్థికంగా దెబ్బ కొట్టిన మాటా వాస్తవమే. గత ఏడాది అఖండ 2 తాండవం సక్సెస్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ అలా జరగకపోవడం కోలుకునే ఛాన్స్ తగ్గించేసింది. భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసిన తర్వాత దర్శకుడు సాగర్ కె చంద్ర వర్క్ చేస్తున్న స్క్రిప్ట్, సినిమా టైసన్ నాయుడే. దీని కోసమే సంవత్సరాలు ఖర్చు పెట్టారు.

ఎట్టకేలకు టైసన్ నాయుడు నిద్ర లేచినట్టుగా కనిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఒక డ్యూయెట్ ని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. రేపు ప్రోమో వస్తుందట. ఇదంతా బాగానే ఉంది కానీ థియేటర్ రిలీజ్ డేట్ వీలైనంత త్వరగా లాక్ చేసుకోవడం ఉత్తమం. నవంబర్ లో ఛాన్స్ లేనట్టే. డిసెంబర్ లో ప్యాన్ ఇండియా సినిమాలు చాలా ఉన్నాయి. మధ్యలో ఏదైనా స్లాట్ ఖాళీ దొరికితే వచ్చేయడం బెటర్. లేదంటే జనవరి చివరి దాకా వెయిట్ చేయాల్సి ఉంది.

ట్విస్ట్ ఏంటంటే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మరో సినిమా హైందవ నవంబర్ 27 విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు ఇంతకు ముందే అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఒకవేళ టైసన్ నాయుడు కనక ఈ స్లాట్ కోరుకుంటే నిర్మాతలు పరస్పర అంగీకారం కింద ఈ మార్పుకు ఒప్పుకుంటారేమో చూడాలి. కాకపోతే మధ్యలో ఓటిటి లిటిగేషన్లు ఉంటాయి కాబట్టి అంత సులభం కాకపోవచ్చు. దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకో వారం పది రోజుల్లో రావొచ్చని అంటున్నారు. ఏదైనా వెయిటింగ్ అయితే తప్పదు.