చిన్న సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అంత సులభం కాదు. ముఖ్యంగా కొత్త హీరోలు, దర్శకులతో తీసిన సినిమాలకు మొదటి రోజు ఓపెనింగ్స్ సాధించడం పెద్ద సవాల్. అందుకే కొందరు నిర్మాతలు తమ సినిమాలకు స్టార్ హీరోలు, పేరున్న దర్శకుల సపోర్ట్ తీసుకుంటున్నారు. ఈ నవంబర్లోనూ అలాంటి సినిమాలు వస్తున్నాయి. అయితే పెద్దవాళ్ల పేర్లు పోస్టర్లపై ఉంటే ఆడియన్స్ టికెట్లు కొంటారా అనేదే అసలు సవాల్.
నవంబర్ 13న విడుదల కానున్న ‘ఇట్లు అర్జున’ను నాగార్జున సమర్పిస్తున్నారు. వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అనీష్ హీరోగా పరిచయమవుతుండగా అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మహేష్ ఉప్పాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగార్జున ఇప్పటికే సినిమా చూసి తనకు నచ్చిందని చెప్పడం కూడా ప్రమోషన్లకు ఉపయోగపడుతోంది. పైగా ఎన్టీఆర్ చేత ట్రైలర్ లాంచ్ అడ్వాంటేజ్. థమన్ సంగీతం మరో అడ్వాంటేజ్.
మరోవైపు నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’ తెరకెక్కుతోంది. ‘కమిటీ కుర్రోళ్లు’తో గుర్తింపు తెచ్చుకున్న త్రినాధ్ వర్మతో పాటు నిర్మల్ ఇందులో నటిస్తున్నారు. జేడీ చక్రవర్తిది కీలక పాత్ర. కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిహారిక నిర్మాణ సంస్థ పేరు ప్రమోషన్లలో ఉపయోగపడుతోంది. ఇప్పటికే టీజర్ కూడా విడుదలైంది.
అయితే నాగార్జున పేరు చూసి ‘ఇట్లు అర్జున’పై ఓపెనింగ్స్ బజ్ వచ్చినా కంటెంట్ తోనే నిలదొక్కోవాలి. అలాగే నిహారిక నిర్మించినంత మాత్రాన ‘పాకెట్ రాకెట్స్’కు భారీ ఓపెనింగ్స్ వస్తాయని చెప్పలేం. పోస్టర్‌పై పెద్ద పేరు ఉండటం, ఆ పేరుతో టికెట్లు అమ్ముడవడం రెండూ వేర్వేరు. పైగా ‘ఇట్లు అర్జున’ ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది.
వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’తో పోటీని తప్పించుకుని నవంబర్ 13ను ఎంచుకున్నారు. కానీ ఆ తేదీకి కూడా ఇతర సినిమాల పోటీ ఉంది. దీంతో స్టార్ సపోర్ట్‌తో పాటు థియేటర్లు, షోల కేటాయింపులు కూడా కీలకమే. ఇలాంటి సినిమాలకు పెద్ద పేర్ల వల్ల ప్రమోషన్లు, మీడియా కవరేజ్, డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఉపయోగం ఉంటుంది. కానీ మొదటి షోకు ప్రేక్షకులను రప్పించేందుకు ట్రైలర్, పాటలు కూడా క్లిక్కవ్వాలి. మరి ఈ సినిమాల కంటెంట్ ఎంతవరకు హైలెట్ అవుతాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates