ఇంకో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘రామాయణం: పార్ట్1’ సినిమా. రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు మేకర్స్ చెప్పుకున్న సినిమా ఇది. ఇంత ఖర్చు అంటే ప్రేక్షకులు ఔట్ పుట్ ఎంతో గొప్పగా ఆశిస్తారనడంలో సందేహం లేదు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ బాగా లేవు అని చెప్పలేం కానీ.. అంచనాలను అందుకోలేదన్నది వాస్తవం. విజువల్ ఎఫెక్ట్స్‌లో విషయంలో గ్రాండియర్ కనిపించింది కానీ.. సహజత్వం మిస్సయిన ఫీలింగ్ కలిగింది. దీంతో విమర్శలు తప్పలేదు.
ఐతే ప్రోమోలు చూసి ముందే ఒక నిర్ణయానికి వచ్చేయలేం కాబట్టి సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ‘రామాయణం’ తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్లో యశ్ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. తమ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చిన్న చిన్న తప్పులు దొర్లితే వాటిని భూతద్దంలో చూడొద్దని, మన చరిత్రను ప్రపంచానికి అందించే ప్రయత్నానికి మద్దతుగా నిలవాలని.. ఈ సినిమాకు ప్రోత్సాహం దక్కకపోతే మళ్లీ ఇలాంటి నిర్మాత దొరకడం కష్టమవుతుందని అతను వ్యాఖ్యానించాడు.
యశ్ ఈ మాట చెప్పగానే.. ‘రామాయణం’ వీఎఫెక్స్ మీద ఇప్పటికే ఉన్న సందేహాలు మరింత బలపడ్డాయి. రేప్పొద్దున ప్రేక్షకులు ఏదో అనడానికి ముందే రామాయణం టీమే ఇందులో వీఎఫెక్స్ ఔట్ పుట్ గొప్పగా ఉండబోదని ఒప్పేసుకుంటోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ప్రేక్షకుల అంచనాలను తగ్గించి, మంచి ఔట్పుట్తో ఆశ్చర్యపరచాలన్నది యశ్ ఉద్దేశమా అన్న చర్చ కూడా నడుస్తోంది.
ఏదేమైనప్పటికీ.. రామాయణం కథతోనే తెరకెక్కిన ‘ఆదిపురుష్’ చిత్రానికి ఎదురైన అవమాన భారం తమ చిత్రానికి ఎదురు కాకూడదని ‘రామాయణం’ టీం జాగ్రత్త పడుతున్నట్లుగా ఉంది. అందుకే ప్రేక్షకులను ముందుగా ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కొన్ని నెలల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌ను అనుసరించే యశ్ ఈ కామెంట్లు చేశాడన్నది స్పష్టం. మరి ‘రామాయణం’ వీఎఫెక్స్ విషయంలో రేప్పొద్దున ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో?
Gulte Telugu Telugu Political and Movie News Updates