దుల్కర్ సల్మాన్‌కు ఇక్కడే రాసిపెట్టి ఉంది

మామూలుగా పెద్ద స్టార్ల కొడుకులు సినీ రంగంలోకి అడుగుపెడితే.. తండ్రి పేరును వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. తండ్రి రెఫరెన్సులను తమ సినిమాల్లో పెడుతుంటారు. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఇందుకు భిన్నం. తొలి చిత్రం నుంచి ఎక్కడా తండ్రి పేరును వాడుకున్నది లేదు. మమ్ముట్టిని అనుకరించడం కానీ.. ఆయన తరహా సినిమాలు చేయడం కానీ.. ఎప్పుడూ జరగలేదు. స్వయంగా తాను ఒక ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా.. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ నటుడిగా గొప్ప పేరు సంపాదించాడు. స్టార్‌గానూ ఎదిగాడు.

మలయాళంలో మమ్ముట్టి స్థాయిని అందుకోవడం కష్టం కానీ.. అతను ఇతర భాషల్లో తండ్రిని మంచి పేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడం విశేషం. ముఖ్యంగా తెలుగులో అతను ఇక్కడి స్టార్లలో ఒకడైపోయాడంటే అతిశయోక్తి కాదు. మామూలుగా తెలుగు సినిమాలు కంటెంట్ పరంగా మలయాళంతో సరితూగవు. ఐతే దుల్కర్ మాత్రం తెలుగులో అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ.. మలయాళంలో చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేక ఇబ్బంది పడుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. ఇలా తెలుగులో దుల్కర్ చేసినా ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే. ఇక్కడ ఇంత గొప్ప సినిమాలు చేస్తున్న టైంలో మలయాళంలో మాత్రం సరైన సినిమాలు పడలేదు. అక్కడ వరుసగా ఫ్లాపులు వస్తూనే ఉన్నాయి. నెల కిందట దుల్కర్నుంచి ‘ఐమ్ గేమ్’ అని మలయాళంలో ఓ సినిమా రిలీజైంది. కానీ అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ చిత్రానికి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు.

మలయాళంలో తన మార్కెట్ బాగా దెబ్బ తిన్న సంకేతాలు కనిపించాయి. ఐతే ఇప్పుడు దుల్కర్ తెలుగులో నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ నుంచి టీజర్ లాంచ్ అయింది. అది ఇన్‌స్టంట్‌‌గా జనాలకు ఎక్కేసింది. ఒక క్లాసిక్ చూడబోతున్న సంకేతాలు కనిపించాయి టీజర్లో.

ఒక అమ్మాయి కలకు ప్రాణం పోసే పాత్రలో అతను అదరగొట్టేసినట్లే ఉన్నాడు. దుల్కర్ మరోసారి తన ఎమోషనల్ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను కదిలించేలా కనిపిస్తున్నాడు. కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మలయాళ సినిమాల్లో దుల్కర్ పట్టు కోల్పోతూ.. కమర్షియల్ ఫార్ములా చుట్టూ తిరిగే తెలుగులో ఇంత మంచి సినిమాలు చేయడం విచిత్రమే. చూస్తుంటే అతడికి ఇక్కడే రాసిపెట్టి ఉందనిపిస్తోంది. నవంబరు 20న రిలీజ్ కానున్న ‘ఆకాశంలో ఒక తార’ కూడా విజయవంతం అయితే.. తెలుగులో తన రేంజ్ ఇంకా పెరగడం ఖాయం.