స్పిరిట్ వాయిదాని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశారు

ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ‘స్పిరిట్’ మార్చి 5 విడుదలని ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. అయితే డిసెంబర్ లో రావాల్సిన ఫౌజీ అనూహ్యంగా వాయిదా పడటమే కాదు మార్చి రిలీజ్ ఆప్షన్ గా పెట్టుకోవడంతో స్పిరిట్ ని తప్పించాలనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో గత కొద్దిరోజులుగా తిరుగుతూనే ఉంది. తాజా పరిణామాలు దాన్ని నిజం చేసేలా ఉన్నాయి.

టి సిరీస్ సంస్థ నిర్మిస్తున్న ‘ఖోస్లా కా ఘోస్లా 2’ మార్చి అయిదు థియేటర్లకు తీసుకొస్తున్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. అంటే ఇదే ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న స్పిరిట్ వాయిదా పడిందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసినట్టే. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ రిలీజ్ డేట్ తో పాటు దీనికి సంబంధించిన కొత్త అనౌన్స్ మెంట్ ఉండొచ్చు. లేదా డేట్ లేకుండా జస్ట్ విషెస్ చెప్పి కొత్త తేదీ గురించి నిర్ణయం తర్వాత తీసుకోవచ్చు. ఇదంతా ఒక రకంగా షాక్ లాంటిదే.

రెండు ప్రభాస్ సినిమాలు తక్కువ గ్యాప్ లో రెడీ అవుతున్న క్రమంలో వచ్చిన తిప్పలివి. చిరంజీవి (విశ్వంభర – కాకా), వెంకటేష్ (ఆదర్శ కుటుంబం – జనవరి 12 విడుదల) ఇదే సమస్య ఫేస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒకటి తప్ప మిగిలినవి ప్యాన్ ఇండియా కాదు. సో తక్కువ గ్యాప్ లో వచ్చినా రిస్క్ లేదు. కానీ ఫౌజీ, స్పిరిట్ రెండూ దేనికవే బడ్జెట్, హైప్ పరంగా నువ్వా నేనా అనే రేంజ్ లో రూపొందుతున్నాయి. సో వీటి మధ్య అవసరమైనంత స్పేస్ ఉండటం ముఖ్యం.

ఈ లెక్కన స్పిరిట్ వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి వచ్చే ఛాన్స్ ఉంది. లేదూ సందీప్ వంగా యానిమల్ సెంటిమెంట్ ఫాలో అయితే కనక 2027 డిసెంబర్ లోనే చూడాల్సి ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ వయొలెంట్ అవతారం ఇందులో ఎలా ఉంటుందోననే ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టే వంగా బ్రదర్స్ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో ఇస్తున్న ఎలివేషన్లు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. కాకపోతే ఫ్యాన్స్ కు మాత్రం ఎక్కువ వెయిటింగ్ తప్పేలా లేదు.