డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం సాధించడంతో తను స్టార్ లీగ్ లోకి ఈజీగా వెళ్ళిపోతుందని అందరూ భావించారు. అయితే ఫ్యామిలీ స్టార్ రూపంలో పెద్ద షాక్ తగలడం ఊహించని పరిణామం. కల్కి 2898 ఏడిలో మొక్కుబడి పాత్ర చేయడం తనకు వర్కౌట్ కాలేదు. ఈ ఏడాది డెకాయిట్ రూపంలో డీసెంట్ హిట్ అయితే దక్కింది. కాకపోతే పాత్ర పరంగా ఉన్న డిఫరెంట్ ట్విస్ట్ అభిమానులకు అంతగా కనెక్ట్ కాలేదు.

సరే వీటి సంగతలా ఉంచితే మృణాల్ ఠాకూర్ ఈ మధ్య తెరమీద కనిపించడం లేదు. ముఖ్యంగా సౌత్ ఆఫర్లను ఒప్పుకోవడం లేదు. అల్లు అర్జున్ రాకాలో ఉందనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది కానీ మీడియా అడిగితే మటుకు మాట దాటవేస్తోంది కానీ కన్ఫర్మ్ గా చెప్పడం లేదు. ఇన్ సైడ్ టాక్ అయితే బన్నీతో నటించడం నిజమే కానీ, యూనిట్ అఫీషియల్ గా చెప్పేదాకా బయట ఎక్కడా రాకా గురించి మాట్లాడకూడదనే కండీషన్ వల్ల అందులో ఆర్టిస్టులు ఓపెన్ కావడం లేదు.

ఇదిలా ఉండగా మృణాల్ కు హిందీలో 2026 అచ్చిరాలేదు. దో దివానే షెహర్ మే, హే జవానీతో ఇష్క్ హోనా హై రెండూ దారుణంగా బోల్తా కొట్టాయి. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పూజా మేరీ జాన్ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకుంటే సోషల్ మీడియాలో పెద్దగా సౌండ్ లేదు. సో ఉన్నంతలో డెకాయిట్ ఒకటే కాస్త రిలీఫ్ కలిగించింది. కథ ప్రకారం అయితే కల్కి 2లోనూ మృణాల్ ఠాకూర్ ఉండాలి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఏమైనా మార్పు చేశారా లేక తీసుకుంటారానేది వేచి చూడాలి.

తొమ్మిది నెలలుగా ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదని చెబుతున్న మృణాల్ ఠాకూర్ ఇకపై మరింత సెలెక్టివ్ గా ఉంటానని చెబుతోంది. మధ్యలో రెండు మూడు స్పెషల్ సాంగ్స్ వచ్చినా నో చెప్పేసింది. అయినా దక్షిణాది నుంచి మంచి ఛాన్సులు వస్తున్నప్పుడు వాటిని కాదని పదే పదే బాలీవుడ్ కే ప్రాధాన్యం ఇవ్వడం ఆమెకు ఫ్లాపులను మూటగడుతోంది. గత ఏడాది చేసిన ఒకే మూవీ సన్నాఫ్ సర్దార్ 2 కూడా ఘోరంగా తుస్సుమంది. మరి రాకా అయినా కోరుకున్న బ్రేక్ ఇస్తుందేమో.