‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని ఉత్కంఠగా ఎదురు చూశారు తన అభిమానులు. బాగా టైం తీసుకుని గీతూ మోహన్ దాస్ అనే లేడీ డైరెక్టర్‌తో అతను జట్టు కట్టినపుడు ఫ్యాన్స్ ఒకింత నిరాశ చెందారు. కానీ ‘టాక్సిక్’ సినిమా ప్రోమోలు చూసి బాగానే హైప్ ఎక్కించుకున్నారు. చివరికి చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
2026లోనే కాదు.. గత కొన్నేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇదే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా అని చెప్పొచ్చు. ‘కేజీఎఫ్’తో వచ్చిన పేరు, మార్కెట్‌ను చేజేతులా దెబ్బ తీసుకున్నాడంటూ యశ్ మీద విమర్శలు వచ్చాయి. ఈ స్థితిలో అతను తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని మళ్లీ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఐతే అతను తనలాగే గట్టి ఎదురు దెబ్బ తిన్న దర్శకుడితో జట్టు కట్టబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
‘టాక్సిక్’ వచ్చిన రెండు వారాలకు భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయిన ‘సర్దార్-2’ సినిమా తీసిన పి.ఎస్.మిత్రన్‌తో యశ్ చేతులు కలుపుతున్నాడట. వీరి మధ్య ఇంతకుముందే కథా చర్చలు జరిగాయి. తాను యశ్‌కు ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ స్టోరీ చెప్పానని, ఆ లైన్ అతడికి నచ్చిందని, కానీ సినిమా ముందుకు కదల్లేదని ‘సర్దార్-2’ ప్రమోషన్ల టైంలో మిత్రన్ చెప్పాడు.
ఐతే ఇప్పుడు ఆ కథనే ముందుకు తీసుకెళ్లాలని యశ్, మిత్రన్ అనుకుంటున్నారట. ‘సర్దార్-2’ మిస్ ఫైర్ అయింది కానీ.. దర్శకుడిగా మిత్రన్ పనితనాన్ని తక్కువ చేయలేం. కొంచెం మెరుగులు దిద్దితే ఆ కథ వర్కవుట్ అయ్యేది. మరి యశ్‌తో చేయబోయే సినిమాను మిత్రన్ కొంచెం జాగ్రత్తగా తీసి తన లాగే పెద్ద హిట్ కోసం చూస్తున్న యశ్ కోరిక కూడా తీరుస్తాడేమో చూడాలి. వీళ్లిద్దరూ కలిసి స్క్రిప్టు ఫైనలైజ్ చేసుకుంటే నిర్మాత దొరకడం పెద్ద కష్టమేమీ కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates