సెన్సార్ బోర్డుపై కుండబద్దలు కొట్టిన కోన

సినిమాల సెన్సార్షిప్‌ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో నంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్ చివరగా చేసిన ‘జననాయగన్’ విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో, సెన్సార్ పూర్తి కాక ఆ సినిమా నెలల తరబడి వాయిదా పడడం వల్ల ఎంత నష్టం వాటిల్లిందో తెలిసిందే. ఇక చిన్న సినిమాల కష్టాలైతే సరేసరి.

విడుదలకు రెండు రోజుల ముందు టైటిల్ మార్చమనడం.. మరీ అభ్యంతరకర కంటెంట్ లేకపోయినా ‘ఎ’ ఇవ్వడం.. మామూలు సన్నివేశాలు, డైలాగులకు కూడా కోత వేయాలని చెప్పడం.. ఇలా సెన్సార్ బోర్డు పెట్టే ఇబ్బందులు మామూలుగా లేవంటూ నిర్మాతలు లబోదిబోమంటున్నారు. రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్లయితే అసలెందుకీ సెన్సార్ బోర్డు అంటుంటారు.

ఈ శుక్రవారం రిలీజ్ కానున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రానికి కూడా సెన్సార్ సమస్యలు తప్పలేదు. ఢిల్లీ వరకు వెళ్లి రివైజింగ్ కమిటీ నుంచి సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ ఇబ్బందుల గురించి అడిగితే.. సెన్సార్ బోర్డు తీరును తప్పుబడుతూ ఈ చిత్ర సమర్పకుడు కోన వెంకట్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు.

‘‘నిజంగా ఇది మాత్రం చాలా పెద్ద సమస్య. దీన్ని ఇప్పుడు వివాదాస్పదం చేయదలుచుకోలేదు. కానీ సరైన సమయంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ఇండస్ట్రీ పెద్దలందరినీ పిలిచి అందులో చర్చించాలనుకుంటున్నాం. ఆల్రెడీ దీని గురించి ఇండస్ట్రీలో నేను మాట్లాడాను. సెన్సార్ బోర్డ్ అన్నది సర్టిఫికేషన్ ఏర్పాటు చేసిన సంస్థ. ఒక సినిమాకు ‘ఎ’ ఇవ్వాలా.. ‘యు-ఎ’ ఇవ్వాలా.. ‘యు’ ఇవ్వాలా అని చెప్పడానికి పెట్టుకున్న ఏజెన్సీ. అంతే తప్ప ఇది ఉంచండి, ఇది తీయండి, ఇది మార్చండి అని చెప్పే అధికారాలు వారికి ఉండవు. కానీ వాళ్ల పరిధులు, పరిమితులు, అధికారాలు దాటి పని చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది.

దీని మీద ఇంకోసారి మాట్లాడదాం. కానీ మేమైతే విజయవంతంగా సెన్సార్ సమస్య నుంచి బయటపడ్డాం. ఢిల్లీ దాకా వెళ్లాం. మా వాదన వినిపించాం. పదిమంది ఇలాగే కూర్చుని ఉన్నారు. వాళ్లెవ్వరికీ తెలుగు రాదు. ఒక 40 నిమిషాల పాటు నా వాదన చెప్పి, నెగ్గి.. యు-ఎ సర్టిఫికెట్‌తో బయటికి వచ్చాం’’ అని కోన చెప్పాడు. మరి ఈ సీనియర్ రైటర్ చెప్పినట్లే ఇండస్ట్రీ ఏకతాటిపైకి వచ్చి ఈ సెన్సార్ ఇబ్బందుల మీద పోరాడుతుందేమో చూడాలి.