రణబాలి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త

సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి నుంచి దాన్ని ఎక్స్, ఇన్స్ టాలో విమర్శలకు లక్ష్యంగా చేసుకున్న వైనం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ట్రోలింగ్స్ కి దొరకని నానిని తన ట్రాక్ రికార్డు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్ధాక్షిణ్యంగా అటాక్ చేశారు. అయినా సరే నూటా నలబై కోట్లకు పైగా రావడమంటే మాటలు కాదు. ఇక విషయానికి వస్తే రణబాలి కోసం కొన్ని బ్యాచులు ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నాయి.

విజయ్ దేవరకొండ హీరో కాబట్టి తనని టార్గెట్ చేసుకునే ఉద్దేశంతో రణబాలి కోసం ఎదురు చూస్తున్న వైనం ముందుగానే కనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. కొత్త రిలీజ్ ఉన్న ప్రతిసారి విజయ్ ఇచ్చుకునే ఓవర్ ఎలివేషన్లు పలు సందర్భాల్లో డ్యామేజ్ చేశాయి. ముఖ్యంగా లైగర్ టైంలో ఇచ్చిన స్టేట్ మెంట్స్ నెగటివిటీ తీసుకొచ్చాయి. ఫ్యామిలీ స్టారప్పుడు కూడా కొంత అతిశయోక్తిగా మాట్లాడ్డం లేనిపోని కామెంట్స్ వచ్చేలా చేసింది. అందుకే అందరూ రణబాలి వైపు చూస్తున్నారు.

ఇప్పుడీ సినిమా టీమ్ చేయాల్సిన పని ఏంటంటే ఓవర్ బిల్డప్ లేకుండా సెటిల్డ్ ప్రమోషన్స్ చేయడం. టీజర్ ఎలాగూ ఆకట్టుకుంది. ట్రైలర్ కూడా బాగుంటే ఆటోమేటిక్ గా ఓపెనింగ్స్ బాగుంటాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు వగైరా చోట్ల విజయ్ దేవరకొండ ఎంతైనా నమ్మకాన్ని చూపించుకోవచ్చు కానీ, అది మరీ బోర్డర్ దాటేలా ఉండకూడదు. ఈసారి ఎలాగూ కంటెంట్ మాట్లాడుతుంది కాబట్టి హిట్టో బ్లాక్ బస్టరో అయ్యాక అప్పుడు ఏం చెప్పినా చెల్లుతుంది.

ఇంకో పద్దెనిమిది రోజులు మాత్రమే ఉండటంతో రణబాలి మీద పబ్లిసిటీ ఒత్తిడి ఉంది. వాయిదా ప్రసక్తే లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. రాహుల్ సంకృత్యాన్ ఆల్రెడీ మీడియా ఇంటర్వ్యూలు మొదలుపట్టారు. పెళ్ళయాక వస్తున్న మొదటి సినిమా కాబట్టి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడికి ఇది చాలా స్పెషల్ మూవీ కానుంది. పోటీగా వారం ముందు ఆదర్శ కుటుంబం, ఒకరోజు ముందు జైలర్ 2 ఉన్నప్పటికీ రణబాలి బృందం చాలా ధీమాగా ఉంది.