ఆ రోజు చిరు బీర్ తాగి ఉంటే..?

చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కొన్ని వీడియోలు అవీ పోస్ట్ చేస్తూ.. ఒక టెంప్లేట్ కామెంట్ పెడుతుంటారు. ఊరికే అయిపోరు మెగాస్టార్లు అని. తన కెరీర్లో చిరు పడ్డ కష్టం, ఆయన చూపించిన క్రమశిక్షణ, తపన, నిబద్ధత వల్లే ఏ బ్యాగ్రౌండ్ లేకపోయినా అంత పెద్ద స్టార్ అయ్యారు. ఇప్పుడు 70 ప్లస్ వయసులోనూ ఫిట్నెస్ కాపాడుకుంటూ, కష్టపడుతూ చిరు ఎంత చురుగ్గా సినిమాలు చేస్తున్నారో తెలిసిందే.

సినీ రంగంలో దారి తప్పడానికి ఎన్నెన్ని అవకాశాలు వస్తాయో.. అలా పక్కదారి పట్టి ఎంతమంది కెరీర్లను నాశనం చేసుకున్నారో ఇండస్ట్రీ జనాలకు బాగా తెలుసు. చిరును కూడా దారి తప్పించడానికి ప్రయత్నాలు జరిగి ఉంటాయనడంలో సందేహం లేదు. ఇలాంటి ఒక అనుభవాన్నే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన డ్రగ్స్ నిరోధక కార్యక్రమంలో చిరు షేర్ చేసుకున్నారు.

“48 సంవత్సరాల క్రితం చెన్నైలో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉంటూ యాక్టింగ్ నేర్చుకునే సమయంలో సరదాగా చెన్నై లోని పాండి బజార్ కి వెళ్ళాను. అక్కడ కొంతమంది.. ‘సరదాగా బీర్ తాగి, చిల్ అవ్వు.. పరిచయాలు పెరిగి అవకాశాలు వస్తాయి’ అని చెప్పారు. కానీ ‘నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, అలాంటి అలవాట్లు లేవు అని చెప్పి పక్కకి తప్పుకున్నాను.

ఆ రోజు బలవంత పెట్టినా మద్యం తాగలేదు. అప్పుడు ఒక పెద్ద మనిషి, మంచి పని చేశావు. నీ లక్ష్యం వైపు అడుగు వెయ్యి అని చెప్పారు. నేను పక్కదారి పట్టకుండా కస్టపడి పని చెయ్యడం వల్లే ఇవాళ మెగాస్టార్ గా మీ ముందు నిలబడ్డాను” అని చిరు కరతాళ ధ్వనుల మధ్య అన్నారు.