దాదా రెండో ఆప్షన్ వైపు చూస్తున్నాడా

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త చర్చ మొదలయ్యింది. డిసెంబర్ 24 విడుదల కావాల్సిన దాదా ఇప్పుడు సంక్రాంతి వైపు చూస్తుందనేది దాని సారాంశం. రెండు రోజుల క్రితం ఎలాంటి వాయిదా ఉండదంటూ దర్శకుడు గోపిచంద్ మలినేని హామీ ఇస్తూ ట్వీట్ వేసిన తక్కువ సమయంలోనే కొత్త ప్రచారం మొదలుకావడం గమనార్హం. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. అంతర్గత సమాచారం ప్రకారం డిసెంబర్ 10 దాకా ఇది కొనసాగుతుంది. అటుపై గుమ్మడికాయ కొట్టేసి రెడీ అయిపోతారు.

ఇంకో రెండు రోజుల్లో ముగుస్తున్న నవంబర్ మినహాయిస్తే దాదా చేతిలో ఉన్నది కేవలం 24 రోజులే. ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. తమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి భారీ స్పందన రాలేదు. మిగిలిన పాటల మీద బాలయ్య అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. టీజర్, ట్రైలర్ ఎప్పుడు సిద్ధమవుతాయో సమాచారం లేదు. డిసెంబర్ 16 ప్రాంతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందనే టాక్ ఉంది. వెన్యూ ఇంకా డిసైడ్ కాలేదట. ఆప్షన్స్ చూస్తున్నారు.

ఇప్పటికైతే దాదా విడుదల ప్లానింగ్ లో ఎలాంటి మార్పు లేదు. క్రిస్మస్ కే వస్తుంది. ఒకవేళ అనుకున్న పనులు అనుకున్న టైంకి కాలేకపోతే మటుకు సంక్రాంతికి వెళ్లాల్సి ఉంటుంది. బాలయ్యకు ఈ పండగ సెంటిమెంట్ చాలా సార్లు కలిసి వచ్చింది. ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. నిజమయ్యే పక్షంలో చిరు వర్సెస్ బాలయ్య మళ్ళీ చూడొచ్చు. ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి, వాల్తేరు వీరయ్య – వీరసింహారెడ్డి తర్వాత మరోసారి ఈ క్లాష్ అఫ్ టైటాన్స్ కలబడతారు.

దాదా నిర్మాత వెంకట సతీష్ కిలారు మటుకు మొదటి ప్రాధాన్యంగా ఉన్న డిసెంబర్ 24 వైపే మొగ్గు చూపుతున్నారట. కాకపోతే కాంపిటీషన్ అయితే తీవ్రంగా ఉంది. ముందు వారం అవెంజర్స్ డూమ్స్ డే, డ్యూన్ పార్ట్ 3తో పాటు దాదా వచ్చే రోజే కింగ్ 100, కింగ్ వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు ఎలాగూ ఇలాంటి సందిగ్ధం ఉంటుంది కాబట్టి కిరణ్ అబ్బవరం తన రియాలిటీని కూడా అదే డేట్ కి వేసి పెట్టాడు. ఇదంతా ఎలా ఉన్నా ముందైతే దాదా పబ్లిసిటీ వేగాన్ని పెంచాల్సిన అవసరం చాలా ఉంది.