శ్రీకాంత్ ఓదెల ఆ విషయంలో రాక్షసుడు

తెలుగులో గొప్ప దర్శకులు అని పేరు తెచ్చుకున్న వాళ్లందరూ పని రాక్షసులే. ఇండియాలోనే నంబర్ వన్ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి నటీనటులు, టెక్నీషియన్లను ఎలా కష్టపెడతాడో కథలు కథలుగా చెబుతూ ఉంటారు. మరో అగ్ర దర్శకుడు సుకుమార్ కూడా అంతే. పర్ఫెక్షన్ కోసం ఎన్ని టేకులైనా తీస్తాడని.. ఒక పట్టాన రాజీపడడని ఆయనకు పేరుంది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల కు కూడా కూడా పని రాక్షసుడు అనే పేరుంది. ఇంకా చెప్పాలంటే పర్ఫెక్షన్ కోసం గురువుకంటే సుకుమార్‌ను మించి ఆర్టిస్టులు, టెక్నీషియన్లను కష్టపెడతాడని తనతో పని చేసిన వాళ్లు చెబుతుంటారు.

ఒక సన్నివేశం కోసం వంద టేకులైనా తీస్తానంటూ స్వయంగా శ్రీకాంతే చెప్పుకొచ్చాడు ఇటీవల. ఐతే సినిమా రిలీజయ్యే టైంకి అందరూ దర్శకుడి గురించి పాజిటివ్‌గానే మాట్లాడతారు కానీ.. సెట్లో ఇలా మళ్లీ మళ్లీ టేక్స్ తీసుకుని, రోజుల తరబడి పని చేయించుకున్నపుడు ఆర్టిస్టులు తీవ్ర అసహనానికి గురవుతారనడంలో సందేహం లేదు. ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్‌గా నటించిన కాయదు లోహర్ తనకు ఇలాంటి ఫీలింగే కలిగినట్లు చెప్పకనే చెప్పింది.

ఒక ఇంటర్వ్యూలో ఆమె శ్రీకాంత్ పనితీరు గురించి మాట్లాడుతూ.. అతనో పని రాక్షసుడు అన్నట్లే మాట్లాడింది. ‘‘అతను క్రేజీ ఫెలో. అంచనాలకు అందడు. తన సెట్లోకి అడుగుపెడితే మనం ఏం చేయబోతున్నామో, ఏం జరుగుతుందో తెలియదు. ఒక ప్లాన్ అంటూ ఏమీ ఉండదు. తన పనితీరు చాలా భిన్నం. ఒక సన్నివేశం పూర్తి చేశాం.. మనం అదరగొట్టేశాం అనుకుంటాం. కానీ అతను ఇంకోలా ఆలోచిస్తాడు. అది మన ఆలోచనకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తన ఆలోచనలకు అనుగుణంగా నటిస్తే.. చివరికి ఆ సన్నివేశం తెరపై ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ మనలో కలుగుతుంది’’ అని కాయదు చెప్పుకొచ్చింది.

‘ది ప్యారడైజ్’ మీకు నేర్పిన పాఠం ఏంటి అని అడిగితే.. ఈ సినిమా తనకు ఓపికను నేర్పిందని చెప్పింది కాయదు. ఐతే ఎంత కష్టపడ్డా చివరికి అది సినిమా కోసమేనని.. అది బాగుంటే చాలని, తాము పడ్డ కష్టాన్ని జనం గుర్తిస్తారని ఆశిస్తున్నామని కాయదు వ్యాఖ్యానించింది. కానీ తెరపై చూసినపుడు ఉన్నంత అందంగా, సరదాగా తెర వెనుక విషయాలు ఉండవని చెప్పడం ద్వారా ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం మామూలు కష్టం పడలేదని చెప్పకనే చెప్పింది కాయదు.