ప్యారడైజ్ డే-1 ఎంత?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో రూపొంది, అత్యధిక అంచనాలతో విడుదల కాబోతోంది ‘ది ప్యారడైజ్’ సినిమా. ఈ సినిమాతో నాని కెరీర్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోతుందనే అంచనాలున్నాయి. దీని బడ్జెట్, బిజినెస్ లెక్కలు చూస్తే.. ఇండస్ట్రీ జనాలకు కూడా మతిపోతోంది. నాని మీద దగ్గర దగ్గర రూ.200 కోట్ల ఖర్చు పెట్టడం.. బిజినెస్ అంతకు మించి జరగడం ఊహకందని విషయం. ఐతే ఈ లెక్కలు మరీ రిస్కీగా అనిపిస్తున్న మాట వాస్తవమే అయినా.. సినిమాకు క్రేజ్ తక్కువగా ఏమీ లేదు.

టైర్-1 హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో హైప్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు టికెట్ల ధరలు పెంచినా సరే.. పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. బుధవారం రాత్రి ప్రిమియర్స్ నుంచే ‘ది ప్యారడైజ్’ మోత మోగించేలా ఉంది. డే-1 కూడా బాక్సాఫీస్ రాంపేజ్ చూడబోెతున్నామనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రోజు వసూళ్లు అంచనాలు మించిపోయేలా ఉన్నాయి.

ఆల్రెడీ ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ కౌంట్ రూ.25 కోట్లు దాటిపోవడం విశేషం. ఇక ఇవాళ, రేపు బుకింగ్స్ జరుగుతాయి. ప్రిమియర్స్‌తో పాటు డే-1 షోలకు వాకిన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపితే కలెక్షన్ల లెక్క ఎక్కడికో వెళ్లేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల అవతల కూడా సినిమాకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. కర్ణాటకలో పెద్ద తెలుగు సినిమాల రేంజిలోనే ఓపెనింగ్స్ రాబట్టేలా ఉంది. యుఎస్‌లో కూడా ‘ది ప్యారడైజ్’ ప్రి సేల్స్ అదిరిపోతున్నాయి. అక్కడ ప్రిమియర్స్‌తోనే సినిమా 1 మిలియన్ మార్కును దాటేయబోతోంది.

మొత్తంగా అన్నీ కలిపి చూస్తే తొలి రోజు ‘ది ప్యారడైజ్’ గ్రాస్ వసూళ్లు రూ.70 కోట్ల మార్కును టచ్ చేసేలా ఉన్నాయి. బుధవారం రాత్రి ప్రిమియర్ షోకు మరీ బ్యాడ్ టాక్ వస్తే తప్ప.. ఈ మార్కు ఆసాధ్యమే. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే.. తొలి రోజు బాక్సాఫీస్ విధ్వంసం మామూలుగా ఉండదు. ఈ నంబర్‌ను కూడా ‘ది ప్యారడైజ్’ మించిపోవచ్చు. ఫుల్ రన్ కలెక్షన్లు కూడా ఎక్కడో ఉంటాయి. నాని టాప్ హీరోల లీగ్‌లోకి వెళ్లిపోవడం ఖాయం.