నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు. కానీ ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక నంది అవార్డులు అట‌కెక్కేశాయి. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొన్నేళ్లు అవార్డులిచ్చింది. ఆ ప్ర‌భుత్వం పోయాక.. జ‌గ‌న్ స‌ర్కారు హ‌యాంలో ఈ అవార్డుల‌ను ప‌క్క‌న పెట్టేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం అస‌లు అవార్డుల సంగ‌తే ప‌ట్టించుకోలేదు.

రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను తీసుకొచ్చి కొన్నేళ్ల‌కు క‌లిపి ఒకేసారి పుర‌స్కారాలు ప్ర‌క‌టించింది. 2025కు సంబంధించి కూడా కొన్ని నెలల ముందే అవార్డులు ప్ర‌క‌టించారు. మ‌రి ఏపీలో నంది అవార్డుల పునరుద్ధ‌ర‌ణ ఎప్పుడా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఉగాదికి అవార్డులు ఉంటాయ‌ని చ‌ర్చ జ‌రిగింది కానీ.. అదేమీ జరగలేదు. ఐతే ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డుల గురించి అప్‌డేట్ వచ్చింది. నంది అవార్డుల గురించి ఎఫ్డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

గతంలో 2012 నుంచి 2016 వరకు నంది ఫిలిం, టీవీ అవార్డులను గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటిని విజేతలకు అందించలేదు. వాటిని ఇప్పుడు అందించడమే కాక.. 2017 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరానికి నాలుగు అవార్డుల (2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ అవార్డులు) కోసం విజేతలను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు భరత్ భూషణ్ తెలిపారు. అలాగే 2025 సంవత్సరానికి నంది ఫిలిం, టీవీ అవార్డులను అందించనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.

నంది అవార్డులకు సంబంధించి అమరావతి లేదా విజయవాడలో భారీ ఈవెంట్ చేయబోతున్నట్లు భరత్ భూషణ్ తెలిపారు. టీవీ అవార్డుల కోసం తిరుపతిలో ఈవెంట్ ఉంటుందన్నారు. అక్టోబరులో నంది, టీవీ అవార్డుల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తామని.. నవంబరులో అవార్డుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని.. డిసెంబరులో అవార్డుల ప్రదానోత్సవాలు జరుగుతాయని భరత్ భూషణ్ వెల్లడించారు. ఫిలిం విభాగంలో మొత్తం 46 అవార్డులు అందించనున్నట్లు ఆయన తెలిపారు.