బుచ్చిబాబు మిస్సయ్యింది శ్రీకాంత్ చేజారకూడదు

సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి రామ్ చరణ్ తన ప్రాణం పెట్టేశాడు. ఉప్పెన తీసింది స్టార్స్ తో కాకపోయినా కథ చెప్పిన విధానంలో నిజాయితీ మెగా కాంపౌండ్ ని మెప్పించింది. అయితే జూన్ 4 నుంచి జరిగింది వేరు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ది సూపర్ హిట్ వసూళ్లు సాధించినప్పటికీ అభిమానులు, ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేదు. అందుకే బయట ఫ్లాప్ అయ్యింది.

ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే శ్రీకాంత్ ఓదెల వయసు కూడా కేవలం ఒక సినిమానే. దసరాతోనే తన మార్క్ ఏంటో చూపించాడు. నానిని ఊర మాస్ గా ప్రెజెంట్ చేసి వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టించాడు. ఆ నమ్మకమే ప్యారడైజ్ అవకాశం వచ్చేలా చేసింది. మార్కెట్ మించిన పెట్టుబడి పెట్టేందుకు నిర్మాత రిస్క్ తీసుకునేలా ప్రేరేపించింది. షూటింగ్ ఆలస్యాలు, రకరకాల అడ్డంకులు ఎన్నింటినో దాటుకుని ఫైనల్ గా రేపు రాత్రి నుంచి ప్రీమియర్ షోలతో రికార్డుల వేట మొదలుపెడుతోంది.

ట్రైలర్ లేకుండా ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం చూస్తుంటే ఒకవేళ సినిమా కనెక్ట్ అయితే జరిగే ఊచకోత అంచనాలకు అందదు. అటు బాలీవుడ్ లోనూ ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రన్నింగ్ లేదు. యాభై రోజులకు దగ్గర పడుతున్నా హనుమాన్ అంశ్ నే చూస్తున్నారు. ప్యారడైజ్ కనక పుష్ప రేంజ్ లో టాక్ తెచ్చుకుంటే నార్త్ ఆడియన్స్ నెత్తిన బెట్టుకుంటారు. తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా జనాన్ని ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఓవర్సీస్ సంగతి తెలిసిందే. బాగుందనే మాట బయటికి వస్తే నాని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో యుఎస్ బాక్సాఫీస్ కు తెలియంది కాదు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఇవన్నీ నిజం కావాలనే. సెన్సార్ రిపోర్ట్స్ బట్టి చూస్తే వయొలెన్స్ ఎక్కువగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ కథా కథనాలు గ్రిప్పింగ్ గా ఉంటే ఎంత హింస ఉన్నా వేల కోట్లు వచ్చి పడతాయని దురంధర్ ఋజువు చేసింది. మరి ప్యారడైజ్ దేని సరసన నిలుస్తుందనేది రేపు అర్ధరాత్రి వచ్చేలోపు తేలనుంది.