‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ సినిమా చేస్తాడా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ముందు అనుకున్న ‘గాడ్ ఆఫ్ వార్’ను పక్కన పెట్టి మరీ బన్నీ.. అట్లీ దర్శకత్వంలో పట్టాలెక్కించిన సినిమా ‘రాకా’. ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ అంచనాతో సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు బడ్జెట్ ఇంకో వంద కోట్లు ఎక్కువే అయిందంటున్నారు.
ఇలాంటి మెగా ప్రాజెక్టుకు పెద్ద పెద్ద టెక్నీషియన్లు పని చేస్తుండగా.. సంగీత దర్శకుడిగా మాత్రం సినిమా మొదలైన టైంకి 20 ఏళ్లు కూడా నిండని సాయి అభ్యంకర్‌ను అట్లీ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే నేరుగా ఈ కుర్రాడిని తాను తీసుకోలేదని.. జి.వి.ప్రకాష్ కుమార్, అనిరుధ్ లాంటి సీనియర్లలో ఒకరిని ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకుందామని ఆలోచించినట్లు అట్లీ తెలిపాడు.
ఈ విషయంలో తనకు కన్ఫ్యూజన్ ఉండేదని.. తాను ప్రతి ఒకట్రెండు సినిమాలకు సంగీత దర్శకుడిని మారుస్తుంటానని.. ఆ క్రమంలోనే సాయి అభ్యంకర్ గురించి ఆలోచించానని అట్లీ తెలిపాడు.
ఐతే అభ్యంకర్‌ను తీసుకుందామని అనుకున్నాక నిర్మాత కళానిధి మారన్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పానని, ఆయన వెంటనే ఓకే చెప్పారని అట్లీ వెల్లడించాడు. సాయి అభ్యంకర్ సినిమాలు వేరేవి ఆల్రెడీ రిలీజైనా.. ‘రాకా’నే తన తొలి చిత్రమని అట్లీ తెలిపాడు. అతను దేవుడి బిడ్డ అని.. ఎప్పుడూ ఇలాగే అణకువతో ఉంటే ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హారిస్ జైరాజ్, యువన్ శంకర్ రాజా, అనిరుధ్ లాంటి దిగ్గజాలు ఉన్న ఈ కాలంలోనూ సాయి సంగీతం కూడా ఎన్నో సంవత్సరాల పాటు నిలిచిపోతుందని అన్నాడు అట్లీ.
‘రాకా’లో సాయి అభ్యంకర్ సంగీతం దుమ్మురేపుతుందంటూ ఈ సినిమాలో మ్యూజిక్ విషయమై అంచనాలు పెంచాడు అట్లీ. ఇక తాను కెరీర్లో ఈ స్థాయిలో నిలబడ్డానంటే అందుకు విజయే కారణమని వ్యాఖ్యానించిన అట్లీ.. తన తొలి చిత్రం ‘రాజారాణి’ సక్సెస్ అయ్యాక తనను నమ్మి విజయ్ వరుసగా మూడు సినిమాలు చేసే అవకాశమిచ్చి తనను పాపులర్ చేశాడన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates