తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయిన సినిమా.. ఆ నలుగురు. ఈ చిత్ర దర్శకుడు చంద్రసిద్దార్థ, కథకుడు మదన్ కలిసి మళ్లీ పని చేయలేదు. ఐతే నాలుగేళ్ల ముందు మదన్ మరణించినప్పటికీ.. ఆయన అందించిన కథతో చంద్రసిద్దార్థ ఇప్పుడో సినిమా తీశారు. అదే.. ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు.
ఏంటి ఇదంతా టైటిలేనా అని ఆశ్యర్యం కలుగుతోందా? అవును. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన టైటిల్ పెట్టి సినిమా తీశారు చంద్రసిద్దార్థ. ఈ టైటిల్ సరిపోదని.. ఈ చిత్రానికి ‘ ఎ ఫర్‌బిడన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’ అనే క్యాప్షన్ కూడా జోడించారు. తన సొంత సంస్థ ‘ఫిల్మోత్సవ్’లోనే చంద్రసిద్దార్థ ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపుగా అందరూ కొత్తవాళ్లే నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.
చంద్రసిద్దార్థ మరోసారి వెరైటీ సినిమానే తీశాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. తన ప్రేయసిని ఇంకొకరితో పంచుకోవాలని చూసే అబ్బాయి.. తన పెళ్లి మండపంలోనే కాబోయే భర్తతో పాటు ఇంకో వ్యక్తి కూడా తనకు ఇష్టమని చెప్పే అమ్మాయి.. ఇలా టిపికల్ క్యారెక్టర్లు, సిచువేషన్లతో ఈ సినిమాను తీర్చిదిద్దాడు చంద్రసిద్దార్థ. తొలి షాట్ నుంచే ఇది రెగ్యులర్ సినిమా కాదని, ఏదో ప్రయోగాత్మకంగా చేశారని అర్థమవుతోంది.
ఈ కథలో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉందని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది. బ్రెయిన్ మ్యాపిక్, మొమెరీస్, గిల్ట్ లాంటి అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ట్రైలర్లో విజువల్స్, బీజీఎం బాగున్నాయి. పులగం చిన్ననారాయణ మాటలు అందించిన ఈ సినిమాలో హర్ష, అమైరా గోస్వామి, సుజనారెడ్డి, ఇనయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ వారం పలు చిన్న సినిమాలతో కలిసి బాక్సాఫీస్ బరిలో దిగుతున్న చంద్రసిద్దార్థ సినిమా.. ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates