నాని పంచుకున్న లెక్కలు రిస్కులు

ఇంకో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం న్యాచురల్ స్టార్ నాని ప్రమోషన్ల వేగం పెంచాడు. ఇవాళ చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొనడంతో పాటు యాంకర్ ప్రదీప్ కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేయడంతో అందులో బోలెడు విషయాలు పంచుకున్నాడు. వాటిలో రిస్కులు లెక్కలు అన్నీ ఉన్నాయి. దసరా విజయం సాధించినా సంతృప్తి చెందని శ్రీకాంత్ ఓదెల తనదగ్గరికి వచ్చి ఈసారి గొప్ప సినిమా తీస్తానని హామీ ఇచ్చి ఆ మాట మేరకే ప్యారడైజ్ కోసం ఎంత కష్టపడింది చెప్పకొచ్చాడు.

ఎంత యాక్షన్ సినిమా అయినా దాన్ని ఎమోషన్ డ్రైవ్ చేయాలి తప్పించి కేవలం ఫైట్ల కోసం కథను నడిపిస్తే తిరస్కారానికి గురవుతాయి. పైగా శ్రీకాంత్ ఓదెల లాంటి రాజీ పడని దర్శకుల వల్ల వన్ మోర్ వన్ మోర్ అంటూ ఆర్టిస్టులతో పదే పదే రీ టేకులు చేయడం ఇబ్బంది కలిగించినా ఫైనల్ గా పర్ఫెక్షన్ అయితే వస్తుంది. రాఘవ్ జుయెల్ ఇందులో పక్కింటి కుర్రాడిగా కనిపిస్తూనే క్రూరమైన విలనీతో భయపెట్టబోతున్నాడు. మదర్ సెంటిమెంట్ కూడా చాలా బలంగా ఉండబోతోంది.

దీనికి ముందు అనుకున్న పేరు సమ్మక్క. హీరో పాత్రకు రెండు జడలు ఎందుకు ఉంటాయనే దానికి ఒక భావోద్వేగాలతో కూడిన బ్యాక్ స్టోరీ ఉంటుంది. మోహన్ బాబు పాత్ర చూసిన పది నిమిషాల లోపే ప్రేమలో పడేలా ఉంటుంది. హిందీ సినిమా హిట్ అయితే దానికి భాషను ఆపాదిస్తారని అదే సౌత్ సినిమాకు వస్తే ప్యాన్ ఇండియా పదం వాడతారని, అందుకే ప్యారడైజ్ కు అది వాడుకోలేదని నాని కుండబద్దలు కొట్టేశాడు. ఇక్కడ చెప్పినవన్నీ తను చెప్పిన ముచ్చట్లే.

ఇవన్నీ చూస్తుంటే నాని నమ్మకం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ లేని లోటు పూడ్చేందుకు నాని తనవైపు నుంచి ఎంత చేయాలో అంతా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇరవై ఒకటి హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి హైప్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్లేందుకు టీమ్ రెడీ అవుతోంది. కయదు లోహర్ బిజీగా ఉన్న కారణంగా అందుబాటులో లేదని, త్వరలోనే జాయినవుతుందని మరో ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు. ఇవండీ న్యాచుల్ స్టార్ కబుర్లు.