టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్వయంగా అక్కడికి వెళ్లడం సోషల్ మీడియాని ఊపేసింది. ముఖ్యంగా తనను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అజిత్ దగ్గరికి విజయ్ ఆత్మీయ స్నేహితుడిలా, చిన్నగా వంగి, మెల్లగా అడుగులు వేసుకుంటూ కౌగిలించుకోవడం ఎక్స్, ఇన్స్ టా తదితర సామజిక మాధ్యమాలని షేక్ చేసి పారేసింది. ఎక్కడ చూసినా ఈ వీడియో క్లిప్పులే తిరుగుతున్నాయి.

ఈ సందర్భంగా టాలీవుడ్ లోనూ ఇలాంటి కలయికలు చూడాలని తెలుగు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా ఒకరినొకరు ఆలింగనం చేసుకునే దృశ్యాలను చూడాలని తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. అలాని ఇప్పుడు మహేష్ ఏదో రేసింగ్ వెళ్లాలని కాదు, పవన్ ముఖ్యమంత్రి కావాలని కాదు. ఏదో వేరే సందర్భంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరిగితే కనులపండుగలా ఉంటుందని వాళ్ళ ఫీలింగ్.

కేవలం మహేషే కాదు పవన్ తో ఇలాంటి కాంబోలను జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ మొదలైన వాళ్ళతోనూ కావాలని అడుగుతున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే సున్నితమైన రాజకీయ వాతావరణం వల్ల మన స్టార్లు ఇలాంటివి చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అంతెందుకు కూటమి ఏర్పడ్డాక, ఏదైనా ప్రజోపయోగ కార్యక్రమం చేశాక పవన్ కు మద్దతుగా నాని లాంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు ఓపెనైన దాఖలాలు చాలా తక్కువ. కారణం పొలిటికల్ సెన్సిటివిటి.

పవన్ ని కలిసినా, సపోర్ట్ చేసినా తమను కూటమి మద్దతుదారులు అనుకుంటారనే ఆలోచన చాలా మందికి ఉండొచ్చు. కానీ విజయ్ అజిత్ అలాంటి లెక్కలేవీ వేసుకోలేదు. సందర్భం దొరికింది, కలుసుకున్నారు. అంతే. తమిళనాడులో ఇలాంటి స్పోర్ట్స్ విజయ్ నిజంగా తీసుకొస్తారో లేదో చెప్పలేం కానీ జనాల మనసులు గెలుచుకోవడానికి చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు పాజిటివ్ వైబ్స్ అయితే మోసుకొస్తాయి. మరి టాలీవుడ్ లో ఈ తరహా సంఘటనలు చూస్తామా అంటే కాలమే సమాధానం చెప్పాలి.