అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు. ఒరిజినల్‌ను మించి రీమేక్‌లు మంచి ఫలితాలు అందుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఐతే మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘దృశ్యం’ సినిమాను హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా రీమేక్ చేస్తే అక్కడ అదే స్థాయిలో సక్సెస్ అయింది. దీని సీక్వెల్‌కు కూడా హిందీలో మంచి స్పందన వచ్చింది.

ఐతే ‘దృశ్యం-3’కు వచ్చేసరికి ఎవ్వరూ ఊహించనది జరిగింది. ఈసారి హిందీ వెర్షన్ కోసం ఒరిజినల్ మీద ఆధారపడలేదు మేకర్స్. అభిషేక్ పాఠక్ అండ్ టీమ్ హిందీ కోసం వేరుగా కథ తయారు చేసుకుంది. మలయాళంలో కంటే ముందే షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ మలయాళ మేకర్స్ పెట్టిన కండిషన్ మేరకు దీన్ని ముందు రిలీజ్ చేయలేదు. జూన్‌లో మలయాళ వెర్షన్ రిలీజ్ కాగా.. దానికి ప్రి రిలీజ్ హైప్ వల్ల కలెక్షన్లు వచ్చాయి కానీ.. కంటెంట్ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అనవసరంగా ఇంకో సీక్వెల్ తీసి కథను సాగదీశారంటూ అసంతృప్తి వ్యక్తమైంది.

కానీ హిందీ ‘దృశ్యం-3’కి మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీని ట్రైలర్ చూస్తేనే ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు కలిగాయి. అందుకు తగ్గట్లే నిన్న రిలీజైన ఈ సినిమాకు అదిరిపోయే రివ్యూలు, టాక్ వస్తున్నాయి. ‘పాతాళ్ లోక్’తో మంచి గుర్తింపు సంపాదించిన జైదీప్ అహ్లావత్‌ను ఈ ప్రాజెక్టులోకి తీసుకోగా.. అతను పెద్ద ఆకర్షణగా మారాడు. కథ కూడా ఆసక్తికరంగా సాగడం.. అజయ్ దేవగణ్ కూడా పెర్ఫామెన్స్ అదరగొట్టేయడంతో సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. వసూళ్లు కూడా మామూలుగా లేవు.

రెండో రోజుకే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టేస్తోందంటే రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు ‘దృశ్యం: ది కంక్లూజన్’ అని టైటిల్ పెట్టడం ద్వారా ఇంతటితో ఈ కథ ముగియనున్నట్లు.. ఈ ఫ్రాంఛైజీని క్లోజ్ చేసేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది టీం. దాని ప్రకారమే కథను ముగించేశారు కూడా.

ఇది కూడా ప్రేక్షకులకు నచ్చుతోంది. కానీ మలయాళంలో మాత్రం ఆల్రెడీ సాగతీతగా అనిపించిన కథను మళ్లీ లాగబోతున్నారు. దృశ్యం-4 కూడా ఉంటుందని ఇటీవలే టీం ప్రకటించింది కూడా. దాని మీద విమర్శలు తప్పలేదు. మొత్తానికి అసలు కొంటే కొసరు ఎక్కువైనట్లు ఒరిజినల్ ‘దృశ్యం’ కంటే.. హిందీ ‘దృశ్యం’ ఫ్రాంఛైజీ మంచి స్పందన తెచ్చుకుంటుండడం విశేషమే.