స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి ఏఐ టెక్నాలజీ దాకా ఎన్నో మార్పులను చూసిన ఆయన 94 సంవత్సరాల వయసులో కూడా ఇంటి నుంచే మెగా ఫోన్ చేపట్టి సింగ్ గీతం తీయడం, అది విమర్శకుల ప్రశంసలు పొందటం ఒక అద్భుతం. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సింగీతం గారు చెన్నై కావేరి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తుది శ్వాస విడిచారు.

సింగీతం శ్రీనివాసరావు గారు పుట్టిన సంవత్సరం 1931. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో మరపురాని క్లాసిక్స్ ఇచ్చారు. రెండు జాతీయ అవార్డులు, అయిదు నంది పురస్కారాలతో పాటు మూడు ఫిలిం ఫేర్ లను సొంతం చేసుకున్నారు. ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా చేత జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. దిగ్గజ దర్శకులు కెవి రెడ్డి దగ్గర అసిస్టెంట్ గా సింగీతం కెరీర్ మొదలుపెట్టారు. ప్రారంభంలోనే మాయాబజార్, జగదేకవీరుని కథకు పని చేసే అదృష్టం దక్కించుకున్నారు.

1971 నీతి నిజాయితీ సినిమా ద్వారా దర్శకుడిగా తొలి అడుగు వేశారు. రెండో తమిళ్ చిత్రం దిక్కత్ర పార్వతితో నేషనల్ అవార్డు అందుకున్నారు. 1977 తరం మారిందితో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. పంతులమ్మ, మయూరి లాంటి ఎన్నో సినిమాలు సింగీతం పేరుని ఇనుమడింపజేశాయి. మాటలే లేకుండా కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోతో పుష్పక విమానం చేయడం ఒక అద్భుతం. గ్రాఫిక్స్ వాడకుండా హీరోని మఱుగుజ్జుగా చూపించిన విచిత్ర సోదరులు ఒక డిక్షనరీ లాంటిది.

బాలకృష్ణతో తీసిన సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369, జానపద మూవీ భైరవ ద్వీపం సింగీతం వారి ప్రతిభకు మచ్చుతునకలు. మయూరితో ఏకంగా పధ్నాలుగు నంది అవార్డులు సాధించడం ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు. రాజ్ కుమార్, కమల్ హాసన్, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, మురళి మోహన్ లాంటి ఎందరో హీరోలతో మరపురాని సినిమాలను ప్రేక్షకులకు కానుకగా ఇచ్చారు. వయసుని ఆయన ఏనాడూ లెక్కచేయలేదు. 2013 వెల్కమ్ ఒబామా దానికో మంచి ఉదాహరణ.

గాయకుడిగా నటుడిగా కూడా సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన ముద్ర వేశారు. తీసింది అరవై పైచిలుకు సినిమాలే అయినా తన ప్రభావం శాశ్వతంగా ఉండేలా చూసుకున్నారు. నాగ్ అశ్విన్ లాంటి యంగ్ ఫిలిం మేకర్స్ ఆయన నుంచి స్ఫూర్తి పొందటం కన్నా నిదర్శనం ఇంకేం కావాలి. సింగ్ గీతంని డైరెక్ట్ చేసిన విధానం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. భౌతికంగా సింగీతం మన మధ్య లేకపోయినా ఆయన ఇచ్చిన అపురూప సినిమాలు భవిష్యత్తు తరాలకు శాశ్వత దిక్సూచిగా నిలిచిపోతాయి.