మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది. లేదా గతంలో ఒకరి నుంచి సాయం పొందామని వాళ్లకు డేట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకోసారి కథ బాలేకపోయినా స్నేహం కోసం ఎస్ చెప్పాల్సి ఉంటుంది. ఇలా రకరకాల ఆబ్లిగేషన్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడీ టాపిక్ కి కారణం మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్. కొన్ని కొత్త సినిమాల రిలీజ్ టైంలో వీళ్ళు రివ్యూలు ఇవ్వడం పాజిటివ్ గా స్పందించడం చాలాసార్లు జరిగింది.

గతంలో కొన్ని అంచనాలు అందుకున్నవి ఉన్నాయి, మరికొన్ని దారుణంగా పోయినవి ఉన్నాయి. ఈ విషయంలో వీళ్ళ ఫ్యాన్స్ విన్నపాలు చేసుకుంటున్నారు. మీకు ఏదైనా సినిమా నచ్చితే రిలీజ్ కు ముందే దాని గురించి పేరాల కొద్దీ రివ్యూలు పెట్టడం వల్ల వాటి మీద అంచనాలు ఎక్కువ పెట్టేసుకుని వెళ్తున్నామని, తర్వాత నిరాశ పడితే ఆ నింద మీ మీదకు వస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇవి మెల్లగా వైరలయ్యే స్థాయిలో తిరుగుతున్నాయి.

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. స్టార్ హీరోలన్నాక వచ్చే ప్రతి సినిమా చూసే అవకాశం ఉండదు. మాస్ థియేటర్లో జనాలు ఏమనుకుంటున్నారు ఎలా ఆలోచిస్తారు అనేంత లోతుగా వాళ్ళు విశ్లేషణ చేసుకోలేరు. ఇంట్లోనో లేదా క్యూబ్ ఉన్న ఏదైనా ప్రత్యేక సముదాయంలో సినిమా చూసి బానే ఉంది కదాని ఫీలవుతారు. ఒక్కోసారి బాగున్నా బాలేకపోయినా నేరుగా మొహం మీద చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ట్వీట్లలో పొగడ్తలు కురిపిస్తారు.

అంతమాత్రాన వాటిని ఆపేయమని చెప్పలేం, కోరుకోలేం. మొహమాటానికి పది వేలు అప్పిచ్చి దాన్ని వసూలు చేసుకోవడానికి నానా తంటాలు పడే మనుషులున్న ప్రపంచంలో కోట్ల రూపాయల పెట్టుబడులతో ముడిపడిన పరిశ్రమలో మొహమాటంతోనో ఫ్రెండ్ షిప్ తోనో ట్వీట్లు వేయడం సహజం. వాళ్ళ జడ్జ్ మెంట్ సరిగా ఉండొచ్చు లేదా తప్పొచ్చు. ముందే దాన్ని ఎవరూ ఊహించలేరు. తమ మాట సాయం ఓపెనింగ్స్ కి ఉపయోగపడుతుందనే ఉద్దేశం తప్ప అక్కడ ఇంకే కారణం ఉండదు.