ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న ప్యాన్ ఇండియా సినిమాల లిస్టుకు అంతూపొంతూ ఉండటం లేదు. ప్యారడైజ్ ఏకంగా ట్రైలర్ కట్ చేయలేని నిస్సహాయ స్థితిలో నేరుగా సినిమా రిలీజ్ కు వెళ్లిపోవడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం నానికి ఒకటే ఎదురవుతున్న సమస్య కాదు. నిఖిల్, సాయి దుర్గ తేజ్ అందరూ ఒకే బైక్ మీద ప్రయాణం చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే రణబాలిని అక్టోబర్ 16 విడుదల చేయనున్నట్టు ఇటీవలే మైత్రి సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంచెం అటుఇటుగా కేవలం నెలరోజుల సమయం మాత్రమే ఉంది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు. చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. రష్మిక మందన్న గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో తను కూడా పాల్గొంటోంది. విజయ్ దేవరకొండ వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. డేట్స్ అన్నీ దీనికే ఇచ్చాడు.
అసలు సమస్య పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర ఉంది. విఎఫ్ఎక్స్ దీనికి భారీగా కావాలి. వందలాది బ్రిటిష్ సైన్యంతో రణబాలి చేసే పోరాటాలు, ప్రకృతి విపత్తులకు సంబందించిన ఎపిసోడ్స్ తో పాటు కొన్ని కీలకమైన ఛేజులు ఫైట్లకు అంతా అయిపోను ఇంకొంచెం వర్క్ పెండింగ్ ఉందట. ఇవి బెస్ట్ క్వాలిటీతో ఉంటేనే ఆడియన్స్ తెరమీద చూసినప్పుడు థ్రిల్ అవుతారు. రాహుల్ రాజీపడకుండా ప్రతిదీ జాగ్రత్తగా చెక్ చేసుకుండటంతో కొంత ఆలస్యం జరిగే అవకాశాలను సులభంగా కొట్టిపారేయలేం.
పైగా అజయ్ అతుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి టైం ఇమ్మని అడిగారట. అంటే తక్కువ రోజులు కాకుండా సరిపడా సమయం ఇవ్వాలి. ప్రమోషన్లతో కలిపి ఇదంతా కేవలం నెల రోజుల్లోనే జరిగిపోవాలి. ఓటిటి ప్రెజర్ ఉంటుంది కాబట్టి దాన్ని చేరుకోవడానికి టీమ్ శాయశక్తులా పోరాడుతోంది కానీ డెడ్ లైన్ అందుకుంటుందా లేదానేది వేచి చూడాలి. భారీ క్యాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిన రణబాలి ఇప్పటికైతే అక్టోబర్ 16కే కట్టుబడి ఉంది. లేదంటే మటుకు డిసెంబర్ కు వెళ్లాల్సి ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates