నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకుంది. ఈ సినిమాలో కొన్ని ముఖ్య స‌న్నివేశాల్లో లాజిక్స్ గురించి చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నానితో క‌లిసి చేసిన చిట్ చాట్‌లో ఇప్ప‌టికే కొన్ని స‌న్నివేశాల‌పై వివ‌ర‌ణ ఇచ్చాడు శ్రీకాంత్. తాజాగా ఈ సినిమా లిరిసిస్ట్ కాస‌ర్ల శ్యామ్‌తో క‌లిసి చేసిన మ‌రో ఇంట‌ర్వ్యూలో ఇంకో ముఖ్య స‌న్నివేశంపై త‌న వెర్ష‌న్ వినిపించాడు శ్రీకాంత్.

ది ప్యార‌డైజ్ క్లైమాక్స్‌లో హీరో చెల్లెలి పాత్ర‌ధారి త‌న బిడ్డ‌ను చంపుకోవ‌డానికి సిద్ధం కావ‌డం మీద అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి.. ఏ తల్ల‌యినా ఇలా చేస్తుందా అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు చాలామంది. దీని గురించి వివ‌ర‌ణ ఇచ్చాడు శ్రీకాంత్.

కథ‌లు రాయ‌డంలో ఒక్కొక్క‌రికి ఒక్కో ర‌క‌మైన ప్ర‌భావం ఉంటుంద‌ని…కొంద‌రు తాము చూసిన ప‌రిస్థితుల నుంచి స్ఫూర్తి పొందుతార‌ని.. ఇంకొంద‌రు పుస్త‌కాలు చ‌దివి క‌థ‌లు రాస్తార‌ని..మ‌రికొంద‌రి మీద హాలీవుడ్ సినిమాల ప్ర‌భావం ఉంటుందని శ్రీకాంత్ అభిప్రాయ‌ప‌డ్డాడు. తాను తెలంగాణ ప్రాంతం నుంచి వ‌చ్చాన‌ని.. ఈ ప్రాంతంలో తాను చూసిన, తెలుసుకున్న‌ విష‌యాల స్ఫూర్తితోనే క‌థ‌లు రాస్తాన‌ని శ్రీకాంత్ చెప్పాడు.

తాను ఒక‌ప్పుడు చూసిన తెలంగాణ వేరు, ఇప్పుడున్న తెలంగాణ వేర‌ని అత‌న‌న్నాడు. ఒక‌ప్పుడు ఇక్క‌డున్న దుర్భ‌ర ప‌రిస్థితుల ఆధారంగానే క‌థ‌లు, స‌న్నివేశాలు రాస్తున్నాన‌ని.. ఒక స‌మ‌యంలో ఇక్క‌డ బానిస బ‌తుకుల‌తో విసుగెత్తిపోయిన మ‌నుషులు.. త‌మ పిల్ల‌ల్ని కూడా అందులోకి దించ‌లేక చంపుకోవ‌డం వాస్త‌వ‌మ‌ని.. ఇలాంటి ఎన్నో ఘ‌ట‌న‌లు చ‌రిత్ర‌లో ఉన్నాయ‌ని అత‌న‌న్నాడు.

సినిమాలో క్లైమాక్స్ సీన్ గురించి చాలామంది ఫోన్ చేసి త‌న‌ను అడిగార‌ని.. అలాగే ట్విట్ట‌ర్లో కూడా ఈ సీన్ మీద అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయ‌ని.. కానీ ఇలాంటివి నిజంగా జ‌రిగాయ‌ని వాళ్ల‌కు తెలియ‌ద‌ని శ్రీకాంత్ అన్నాడు. కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ర‌జాకార్ల టైంలో పిల్ల‌లు, ముఖ్యంగా ఆడ‌పిల్ల‌ల గొంతుల్లో వ‌డ్ల గింజ‌లు వేసి చంపుకున్న ఉదంతాలున్నాయ‌న్నాడు.

ఇక ది ప్యార‌డైజ్ విష‌యానికి వ‌స్తే… మిక్స్డ్ టాక్‌తోనూ ఈ సినిమా భారీ వ‌సూళ్లే సాధించింది. రెండో వీకెండ్లో కూడా బాగానే పెర్ఫామ్ చేస్తోంది. ఈ సినిమా ఇప్ప‌టిదాకా రూ.160 కోట్ల దాకా గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది.