‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా మాటల మాంత్రికుడు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్స్ కు పని చేశారు కానీ డైరెక్టర్ గా వెంకీ మామ కోసం మెగా ఫోన్ పట్టుకోవడానికి రెండు దశాబ్దాలకు పైనే పట్టింది. అందుకే ఆదర్శ కుటుంబం ఏకె 47 మీద ఇన్ని అంచనాలు నెలకొన్నాయి. టీజర్ రూపంలో ఇవాళ ప్రేక్షకుల ముందుకు కంటెంట్ ఎలా ఉండబోతుందో పరిచయం చేశారు.

చిట్టిబాబు (వెంకటేష్) ది మధ్యతరగతి కుటుంబం. భార్య (శ్రీనిధి శెట్టి), ఇద్దరు పిల్లలతో ఏదో నెట్టుకొస్తూ అప్పుల ఊబిలో మునిగి తేలుతూ ఉంటాడు. చేసేది చిన్న ఉద్యోగం, ఉండేది అద్దె కొంప. అలాంటి టైంలో లాటరీ లాంటిది తగిలి కోట్లు వచ్చి పడతాయి. 47 నెంబర్ ఉన్న ఒక పెద్ద విల్లా కొనుక్కుని ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ చేస్తాడు. అయితే ఒక రాత్రి అనుకోని ప్రమాదం విలన్ గ్యాంగ్ రూపంలో తలుపు తడుతుంది. అప్పుడు చిట్టిబాబులోని యాక్షన్ హీరో బయటికి వస్తాడు. అదేంటో తెరమీద చూడాలి.

త్రివిక్రమ్ మార్కు ప్రతి ఫ్రేమ్ లో, మాటలో కనిపించింది, వినిపించింది. అప్పు పప్పు అంటూ తనదైన ప్రాసలతో మొత్తం వినోదాన్ని నింపేశారు. అసలు ట్విస్టుని ఎక్కువ రివీల్ చేయలేదు కానీ విల్లా 47కి ఒక పెద్ద రౌడీ గ్యాంగ్ కి ఏదో కనెక్షన్ ఉందనే హింట్ అయితే ఇచ్చారు. అంతే కాదు ఎంత ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్నా అవసరమైతే తనలో మాస్ హీరో బయటికి వస్తాడనే రీతిలో వెంకీతో చెప్పించిన డైలాగు దగ్గుబాటి అభిమానులకు మంచి ఊపు ఇచ్చేలా ఉంది.

బయట ప్రచారం జరిగినట్టు కాకుండా ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2 విడుదల తేదీకే కట్టుబడుతోంది. తర్వాత చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగితే చెప్పలేం కానీ గాంధీ జయంతికి చిట్టిబాబు రావడం ఖాయంగానే ఉంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సింపుల్ గా సాగగా. రఘుబాబుని తప్ప ఇతర ఆర్టిస్టులు రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ కాంబో నుంచి మూవీ లవర్స్ ఏదైతే ఆశిస్తున్నారో వాటినైతే టీజర్ లో పొందుపరిచారు. సో అంచనాలు అందుకుంటే మాత్రం హిట్టుకి ఢోకా ఉండదు.