వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి ఆ స్లాట్ తీసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇది ముందుగా గుర్తించిన వృషకర్మ డిసెంబర్ 4 లాక్ చేసుకుంది. ఆ మేరకు ప్రమోషన్లు మొదలుపెట్టేసింది. దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ కూడా అదే టైంలో రావొచ్చని వార్తలు వినిపించిన నేపథ్యంలో చైతు బృందం ముందుగానే కర్చీఫ్ వేసుకుంది. అయినా కూడా శ్రీశ్రీ వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం.

చెప్పాలంటే వృషకర్మ చాలా తెలివైన పని చేసింది. ఎందుకంటే డిసెంబర్ మొదటి వారం మంచి సీజన్. పరీక్షల హడావిడి ఉండదు. సెలవులు లేకపోయినా బాక్సాఫీస్ పరంగా మంచి కెపాసిటీ ఉన్న వారం అది. గతంలో అఖండ, పుష్ప 2, యానిమల్ లాంటి ఇండస్ట్రీ హిట్లు ఈ టైంలోనే వచ్చి దాన్ని ఋజువు చేశాయి. ఫౌజీ కూడా ఆ నమ్మకంతోనే ఫిక్స్ అయ్యింది కానీ ఎంతకీ తెగని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వెనుకడుగు వేసి 2027 వేసవికి వెళ్లాల్సి వచ్చింది.

నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన వృషకర్మ మీద నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ చాలా ఖర్చు పెట్టారు. ప్యాన్ ఇండియా స్థాయిలో రీచ్ అవుతుందనే నమ్మకంతో రాజీ పడలేదు. వంద కోట్లకు పైగానే అయ్యిందని టాక్. థియేటర్ బిజినెస్ చైతుకి అంత లేకపోయినప్పటికీ తండేల్ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్ ముందుకు వెళ్లేలా చేస్తోంది. అందులోనూ విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వ ప్రతిభ గురించి ఇన్సైడ్ టాక్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి.

మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన వృషకర్మని ఫాంటసీ, పీరియాడిక్ సెటప్ మిక్స్ చేసి తీశారు. గుప్త నిధులు, చరిత్ర రహస్యాలు, పూర్వకాలపు నేపథ్యం, వర్తమానం ఇలా అన్ని అంశాలను మేళవించారు. అజనీష్ బి లోకనాథ్ సంగీతం సమకూర్చారు. చైతు దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇది కనక క్లిక్ అయితే హిందీ మార్కెట్ ఓపెనవుతుంది. లాల్ సింగ్ చద్దా చేసిన గాయం మానుతుంది. ఏదైతేనేం డేట్ కోసం సతమతపడిన వృషకర్మ నెత్తి మీద ఫౌజీ పాలు పోసింది.