వెంకటేష్ చెంప మీద ఎందుకు కొట్టుకున్నాడు

దర్శకుడు యాక్షన్ చెప్పాక.. యాక్టర్ డైలాగ్ మరిచిపోతే ఏమవుతుంది? కట్ చెప్పి మళ్లీ ఆ సీన్ తీస్తారు కదా. ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూట్ టైంలో తాను కూడా ఒక సన్నివేశంలో వెెంకీ డైలాగ్ మరిచిపోయాడేమో అనుకుంటే.. ఆయన ఒక సన్నివేశాన్ని భలేగా ఇంప్రొవైజ్ చేశారంటూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు.

ఈ సినిమా టీజర్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి అప్పు గురించి చెబుతూ నా అప్పు 4 లక్షలు, వీడి ఆపరేషన్‌కి 2 లక్షలు అంటే.. వెంకీ కొడుకు పాత్ర చేసిన పిల్లాడు రెండూ కలిపితే 7 లక్షలు అంటాడు. అప్పుడు వెంకీ చిన్న పాస్ ఇచ్చి తనకు తాను చెంపదెబ్బ కొట్టుకుని, డైలాగ్ చెబుతాడు. ఐతే ఒరిజినల్‌గా ఈ సీన్లో వెంకీ చెంపదెబ్బ కొట్టుకోవడం అన్నది సన్నివేశంలో లేదట. కానీ తాను యాక్షన్ చెప్పాక వెంకీ తనకు తానుగా ఇది చేశారని త్రివిక్రమ్ చెప్పాడు.

ఆ సీన్లో తాను డైలాగ్ చెప్పాల్సిన చోట వెంకీ పాస్ ఇవ్వడంతో ఆయన డైలాగ్ మరిచిపోయారేమో అనుకున్నానని.. కానీ వెంటనే తనను తాను చెంపదెబ్బ కొట్టుకున్నారని.. ఆ తర్వాత డైలాగ్ చెప్పారని.. ఇది తనకు భలేగా నచ్చి ఆ సన్నివేశాన్ని అలాగే ఉంచేశానని, రీటేక్‌కు వెళ్లలేదని.. వెంకీ అలా కొట్టుకోవడం సన్నివేశానికి ఆకర్షణగా మారింది త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

ఇక ‘ఆదర్శ కుటుంబం’ అంటే ఏంటో నాలుగు ముక్కల్లో చెప్పమని త్రివిక్రమ్‌ను అడిగితే.. ‘‘లెక్కలు రాని కొడుకు.. మాట వినని కూతురు.. అప్పులు చేసే పెళ్ళాం.. ఫ్రస్టేషన్‌లో ఉన్న భర్త.. వీళ్ల మధ్య నడిచే కథ’’ అంటూ వివరించాడు మాటల మాంత్రికుడు.

కథ గురించి ఇంకొంచెం వివరిస్తూ.. చాలా తెలివిగా ప్లాన్ చేశాం అనుకున్న ఇద్దరి మధ్యలోకి ఒక కార్నర్ నుంచి ఊహించని విధంగా వచ్చి గేమ్‌ను తన చేతుల్లోకి తీసుకునే వ్యక్తి కథ ఇదని.. ఇందులో కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉంటుందని త్రివిక్రమ్ చెప్పారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.