ఇప్పటిదాకా ‘మనం’ చూడని సుమంత్

మనం సినిమా అక్కినేని కుటుంబానికి ఎంత ప్రత్యేకమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులో మూడు తరాల అక్కినేని హీరోలు అక్కినేని నాగేశ్వరరావు-నాగార్జున-నాగచైతన్య కలిసి నటించారు. అఖిల్ కూడా ఒక క్యామియో చేశాడు. ఏఎన్నార్‌కు ఇదే చివరి చిత్రం. అద్భుతమైన కథాకథనాలతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. ఐతే ఇంత గొప్ప సినిమాను అక్కినేని కుటుంబంలో ముఖ్యుడైన సుమంత్ ఇప్పటిదాకా చూడలేదట.

ఏఎన్నార్‌ పెద్ద మనవడు, ఆయనకు ఎంతో ఇష్టమైన సుమంత్.. తన తాత చివరి చిత్రాన్ని చూడకపోవడం ఆశ్చర్యం కలిగించేదే. ఐతే ఇందుకు ఒక బలమైన కారణం ఉందంటున్నాడు సుమంత్. తన తాత చివరి దశలో చాలా ఇబ్బంది పడుతూ చేసిన సినిమా ఇదని.. ఆ సినిమా చూస్తే తనకు ఆయన చివరి రోజులే గుర్తుకొచ్చి చాలా బాధ కలుగుతుందని, అందుకే ఆ సినిమా చూడలేదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు సుమంత్.

‘మనం’ సినిమా చూసేందుకు ఒకట్రెండు సార్లు ప్రయత్నించానని.. కానీ తాత ఆరోగ్య పరంగా బాగా ఇబ్బంది పడ్డ చివరి దశ గుర్తుకు వచ్చి, ఆయన మరణం తాలూకు బాధ కూడా వెంటాడి సినిమాను కొనసాగించలేక ఆపేశానని సుమంత్ తెలిపాడు. ‘మనం’ సినిమాను తాత ఎంత ఇబ్బంది పడుతూ పూర్తి చేశాడో తనకు తెలుసని సుమంత్ చెప్పాడు. అప్పటికి క్యాన్సర్ చివరి దశకు చేరిందని.. ఆ సినిమాలో నటించడానికి, డబ్బింగ్ చెప్పడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారని అతనన్నాడు.

ఐతే నటిస్తూనే చనిపోవాలన్నది ఆయన కోరిక అని.. దాదాపుగా అదే జరిగిందని, ఆ సినిమాకు పని చేస్తూ ఆయన మరణానికి అత్యంత దగ్గరగా వెళ్లారని సుమంత్ చెప్పాడు. ఇంటికి దగ్గర్లోనే ఉన్న స్టూడియోకు వెళ్లి కూడా డబ్బింగ్ చెప్పలేని పరిస్థితుల్లో ఇంట్లోనే డబ్బింగ్ ఏర్పాట్లు చేశామని.. అక్కడ కూర్చుని అతి కష్టం మీద డైలాగులు చెప్పారని సుమంత్ గుర్తు చేసుకున్నాడు.

ఒకసారి షూట్ చేస్తుండగానే చాలా సీరియస్ అయి ప్రాణం మీదికి వచ్చిందని.. సర్జరీ చేసి ఇంకొన్ని రోజులు ఆయన జీవిత కాలాన్ని పొడిగించారని.. ఒకవేళ అప్పుడాయన చనిపోయి ఉంటే మనం సినిమానే ఆగిపోయేదని సుమంత్ తెలిపాడు. ఇవన్నీ చూశా కాబట్టే ‘మనం’ సినిమా చూస్తే ఆయన బాధ గుర్తుకు వచ్చి ఆ సినిమాను పూర్తి చేయలేకపోయానన్నాడు సుమంత్.