ఊహించని స్పీడుతో ‘షేర్’ పరుగులు

ఆయా షేర్ అంటూ పాటల నుంచే సంచలనాలు మొదలుపెట్టిన ది ప్యారడైజ్ సినిమా దానికి తగ్గట్టే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దూకుడు చూపిస్తోంది. పరిమిత లొకేషన్లలో అమ్మకాలు మొదలుపెట్టినా కేవలం గంటల వ్యవధిలో లక్ష డాలర్ల మార్కు దాటేయడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. తాజాగా ఎక్స్డి బుకింగ్స్ కూడా మొదలైపోవడంతో నెంబర్లు అంతకంతా పెరగబోతున్నాయి. ప్రీమియర్ పడే లోపు రెండు మిలియన్ల దగ్గరికి వెళ్లొచ్చని ఒక అంచనా.

సెప్టెంబర్ 24 విడుదల తేదీలో ఇంకెలాంటి మార్పు లేనట్టే. చివరి నిమిషం షూటింగ్ లో ఎంత ఒత్తిడి ఉన్నా సరే డేట్ మిస్ చేసుకునే ఉద్దేశం లేకపోవడంతో టీమ్ రేయింబవళ్లు కష్టపడుతోంది. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాళ్లకు కత్తులు పెట్టుకుని పరుగులు పెడుతున్నాయి. ఇంకోవైపు అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తాలూకు వర్క్ ఇదే వారంలో స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడెక్కడ ఈవెంట్లు చేయాలనే దాని మీద ఇప్పటికైతే ప్రణాళిక వేసుకోలేదని యూనిట్ టాక్.

ఎప్పుడు నాని వైపు నుంచి చూసే అగ్రెసివ్ ప్రమోషన్లు ప్యారడైజ్ కి ఉండకపోవచ్చని టాక్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు షోలు వేసినా రికార్డు ఓపెనింగ్స్ ఖాయమనిపించే రేంజ్ లో హైప్ నెలకొంది. ప్రత్యేకంగా దాన్ని పెంచాల్సిన అవసరం లేదనేది నాని గట్ ఫీలింగట. అది నిజం కూడా. ప్రేక్షకుల్లో ఆ స్థాయి క్రేజ్ ఉంది మరి. దాన్ని నిలబెట్టుకునేలా ప్రీమియర్ టాక్ వస్తే చాలు. భారతీయ కాలమాన ప్రకారం సెప్టెంబర్ 23 రాత్రి 12 గంటలకు మొదటి షో పడనుంది.

ఇండియాలో కూడా అదే సమయంలో షోలు వేసేలా నిర్మాతలు ప్లానింగ్ లో ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ప్యారడైజ్ లో మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ విలన్లు కాగా కయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. పీరియాడిక్ సెటప్ లో దశాబ్దాల క్రితం సికంద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా శ్రీకాంత్ ఈ కథను సిద్ధం చేశారు. ట్రైలర్ రెండో వారం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. లాంచ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు.